మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. ఈ నెల 25 వరకూ ఆయన్ను అరెస్ట్ చేయవద్దని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. అవినాష్ రెడ్డి దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ పై నేడు తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగానే హైకోర్టు పై ఉత్తర్వులిచ్చింది. ఇక… ఈ నెల 25 వరకూ ప్రతి రోజూ అవినాష్ రెడ్డి సీబీఐ విచారణక రోజూ హాజరు కావాలని, విచారణకు పూర్తిగా సహకరించాలని ఆదేశించింది.
అలాగే విచారణ ఆడియో, వీడియోను కూడా రికార్డు చేయాలని సూచించింది. మరోవైపు ఈ నెల 25 న ముందస్తు బెయిల్ పిటిషన్ పై తుది తీర్పు ఇస్తామని హైకోర్టు తెలిపింది. ఈ కేసులో ఎంపీ అవినాష్ రెడ్డి, సీబీఐ, సునీత తరపు లాయర్ల మధ్య హోరాహోరీగా వాదనలు జరిగాయి. గంటన్నరపాటు తమ తమ వాదనలు వినిపించారు. కేసు విచారణలోనే సీబీఐ చాలా అంశాలను విస్మరిస్తుందని.. కుట్ర పూరితంగా వ్యవహరిస్తుందని అవినాష్ తరపు లాయర్లు వాదించారు. రాజకీయ కారణాలతోనే కేసులో ఇరికిస్తున్నారని.. హత్యతో సంబంధం ఉన్న ఎర్రగంగిరెడ్డి, దస్తగిరిని వదిలేశారని అవినాష్ తరపు లాయర్ కోర్టులో వాదనలు వినిపించారు.