యూపీలో ఇక మాఫియా పేరుతో ఎవ్వరనీ బెదిరించలేరు : సీఎం యోగి

గ్యాంగ్ స్టర్ అతీక్ అహ్మద్ హత్య తర్వాత యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తొలిసారిగా స్పందించారు. యూపీలో ఇక మాఫియా పేరుతో ఎవ్వరనీ బెదిరించలేరని తేల్చి చెప్పారు. ఒకప్పుడు మాఫియా ప్రజలను భయభ్రాంతులకు గురిచేసేదని, పారిశ్రామికవేత్తలను బెదిరించడం, వ్యాపారవేత్తలను అపహరించడం చేసేవారని ఆయన గుర్తుచేశారు.లక్నోలో టెక్స్ టైల్స్ పార్క్ ఎంవోయూ కార్యక్రమంలో సీఎం యోగి పాల్గొన్నారు.

 

2017కు ముందు రాష్ట్రంలో శాంతి భద్రతలు దారుణంగా ఉండేవని, నిత్యం అల్లర్లతో చెడ్డపేరు ఉండేదని యోగి గుర్తు చేశారు. తాము అధికారంలోకి వచ్చాక మాఫియా అంతుచూశామన్నారు. యూపీ ప్రగతి బాటలో నడుస్తోందన్నారు. ఇకపై యూపీలో ఫోన్ల ద్వారా వ్యాపారవేత్తలు బెదిరించే రోజులు పోయాయని యోగి అన్నారు. యూపీలో 2012 నుంచి 2017 వరకూ 700కు పైగా అల్లర్లు జరిగాయని, 2017 నుంచి ఇప్పటివరకూ ఒక్క ఘటన కూడా అలాంటిది జరగలేదని, కర్ఫ్యూ పెట్టాల్సిన అవసరమే రాలేదన్నారు.

 

అతీక్‌ అహ్మద్‌, అతడి సోదరుడు అష్రాఫ్‌ అహ్మద్‌ను ఈ నెల 15న ప్రయాగ్‌రాజ్‌లోని కెల్విన్‌ ఆస్పత్రిలో వైద్య పరీక్షలకు తీసుకెళ్తుండగా.. లవ్లేశ్‌ తివారీ, సన్నీ సింగ్, అరుణ్‌ మౌర్య మెడలో మీడియా ఐడీ కార్డులు ధరించి, అక్కడకు చేరుకున్నారు. దుండగుల్లో ఒకడు అతీక్‌ కణతపై రివాల్వర్‌ను పెట్టి, ట్రిగ్గర్‌ నొక్కేశాడు. అతీక్‌ కుప్పకూలిపోయాడు. ఆ వెంటనే దుండగులు అష్రాఫ్‌ వైపు వచ్చి.. అతణ్నీ కాల్చి చంపారు. అంతటితో ఆగకుండా.. కుప్పకూలిన ఆ ఇద్దరిపై కాల్పులను కొనసాగించారు.

 

గ్యాంగ్ స్టర్ అతీక్ అహ్మద్ ను కాల్చి చంపిన వ్యక్తులను యూపీలోని నైనీ జైలు నుంచి ప్రతాప్ గఢ్ జైలుకి తరలించారు. భద్రతా కారణాల వల్లే ఈ తరలింపు జరిగిందని అధికారులు వివరించారు. నైని జైలులో శిక్ష అనుభవిస్తున్న వారిపై దాడులు జరిగే అవకాశం వుందని పోలీసులు అనుమానాలు వ్యక్తం చేశారు. అతీక్ ను హత్య చేసిన ముగ్గురు వ్యక్తులకు కోర్టు 14 రోజుల పాటు జ్యుడీషియల్ కస్టడీ విధించింది.

 

తాము ఫేమస్ కావాలనే అతీక్ అహ్మద్ ను చంపినట్లు నిందితులు పేర్కొన్న విషయం తెలిసిందే. ఇక… అతీక్ అహ్మద్ శరీరంలో 9కి పైగా బుల్లెట్లు ఉన్నట్టు పోస్టుమార్టం రిపోర్టులో వెల్లడైంది. పాయింట్ బ్లాంక్ రేంజ్ లో కాల్పులు జరపడంతో తలలోకి ఒక బుల్లెట్ దూసుకెళ్లింది. మిగతావి ఛాతి భాగంలో, వీపుపై తగిలినట్లు రిపోర్టులో డాక్టర్లు పేర్కొన్నారు. అతడి సోదరుడు ఆష్రఫ్ శరీరంలో 5 బుల్లెట్లను గుర్తించినట్లు సమాచారం.

 

 

Related Posts

Latest News Updates