పచ్చదనం, పరిశుభ్రతతోపాటు పలు అభివృద్ధి ఇతివృత్తాలు (థీం) విభాగాల్లో తెలంగాణ పంచాయతీలు దేశంలోనే అత్యున్నత స్థాయిలో నిలిచి జాతీయ అవార్డులు అందుకోవడం పట్ల ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు హర్షం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మొత్తం 46 ఉత్తమ అవార్డుల్లో తెలంగాణ రాష్ట్రమే 13 కైవసం చేసుకోవడం మనందరికీ గర్వకారణమని పేర్కొన్నారు. దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ పంచాయతీ సతత్‌ వికాస్‌ పురసారాల్లోని 9 థీం ఆధారిత విభాగాల్లో తెలంగాణ రాష్ట్రమే 8 అవార్డులను సాధించడం విశేషమని సీఎం తెలిపారు.

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అవార్డులు అందుకున్న రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావును, కార్యదర్శి సందీప్‌ కుమార్‌ సుల్తానియా, కమిషనర్‌ హనుమంతరావు, ఆయా గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీపీలు, జిల్లా పరిషత్‌ చైర్మన్లు, పంచాయితీరాజ్‌ శాఖ అధికారులను సీఎం కేసీఆర్‌ అభినందించారు.

పల్లెప్రగతి సహా గ్రామీణాభివృద్ధి దిశగా దేశానికే ఆదర్శంగా రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న గ్రామీణాభివృద్ధి కార్యాచరణకు ఈ అవార్డులు సాక్ష్యంగా నిలిచాయని సీఎం పేర్కొన్నారు. పంచాయతీల అభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రం ప్రతిఅంశంలోనూ అగ్రగామిగా నిలిచి, అత్యధిక అవార్డులు గెలుచుకున్న స్పూర్తితో తెలంగాణ ఆదర్శంగా దేశవ్యాప్తంగా పల్లెల అభివృద్ధికోసం తమ కృషి కొనసాగుతుందని సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు.

 

ఉత్తమ పంచాయతీలు, మండల, జిల్లా పరిషత్ లకు కేంద్రం ప్రకటించిన అవార్డులను తెలంగాణ ప్రతినిధులు ఢిల్లీలో రాష్ట్రపతి ముర్ము చేతుల మీదుగా అందుకున్నారు. జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా కేంద్ర పంచాయతీరాజ్ శాఖ ఢిల్లీలో పంచాయతీలకు ప్రోత్సాహంపై జాతీయ సదస్సు- అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించింది.

 

దీనికి రాష్ట్రపతి ముర్ము, కేంద్రం మంత్రి గిరిరాజ్ సింగ్ తదితరులు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీపీ, జెడ్పీ చైర్మన్ తదితరులు ఈ అవార్డులను స్వీకరించారు. జల, ఆరోగ్య సమ్రుద్ధి, మౌలిక వసతుల కల్పన, జీవనోపాధి పెంపు, సుపరిపాలన, పచ్చదనం పరిశుభ్రత విభాగాల్లో దేశంలోనే ఉత్తమ పనితీరు కనబరిచిన తెలంగాణ రాష్ట్రం… 13 జాతీయ పురస్కారాలను అందుకుంది.