ఏపీ విషయంలో తెలంగాణ మంత్రి హరీశ్ చేసిన వ్యాఖ్యలు దుమ్ము దుమారం రేపాయి. ఏపీలో పాలన ఎలా వుందో అక్కడి నుంచి తెలంగాణకు వచ్చి స్థిరపడిన కార్మికులకు బాగా తెలుసని, అయితే ఒక దిక్కే ఓటు హక్కు పెట్టుకోండి అని సూచించారు. అదీ తెలంగాణలోనే పెట్టుకోండి.. ఆంధ్రాలో ఓటు హక్కు రద్దు చేసుకోండి అని.. తెలంగాణలో నివసించే ఆంధ్రప్రదేశ్ పౌరులకు సూచించారు. దీనిపై ఏపీ మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలు తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఈ నేపథ్యంలో మంత్రి హరీశ్ మళ్లీ ఏపీ మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలకు కౌంటర్ ఇచ్చారు.
ఏపీ గురించి తానెప్పుడూ తప్పుగా మాట్లాడలేదన్నారు. అడిగిన దానికి సమాధానం చెప్పలేకే… వైసీపీ నేతలు తనను విమర్శిస్తున్నారని ఎద్దేవా చేశారు. చేతనైతే ప్రత్యేక హోదా కోసం పోరాడాలని హితవు పలికారు. విశాఖ ఉక్కు కోసం పోరాడాలని, పోలవరం తొందరగా పూర్తి చేసి కాళేశ్వరంలా నీళ్లు అందించాలన్నారు. ఏపీ ప్రజలు ఇక్కడ సెటిల్ అయితే చల్లగా ఉండండి, బాగుండాలని చెప్పానన్నారు. తాము ఆంధ్రప్రదేశ్ గురించి తప్పుగా ఏం మాట్లాడలేదన్నారు. తెలంగాణలో అన్ని బాగున్నాయని.. ఇక్కడే ఉండండి అనీ, ఆ రోజు అన్నానని వివరణ ఇచ్చారు. ప్రజల్ని, ఏపీని కించ పరచే విధంగా మాట్లాడానని కొందరు నాయకులు అనడం, అది వారి విజ్ఞతకు వదిలేస్తున్నానని హరీశ్ పేర్కొన్నారు.