పరువునష్టం కేసులో రాహుల్ గాంధీకి ఊరట

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీకి భివాండీ మేజిస్ట్రేట్‌ కోర్టు నుంచి ఊరట లభించింది. రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌ కార్యకర్త రాజేష్‌ కుంతే కేసులో పరువునష్టం విచారణలో రాహుల్ గాంధీ కోర్టుకు హాజరు కాకుండా శాశ్వత మినహాయింపును మంజూరు చేసింది. కోర్టు ఆదేశాలను అనుసరించి రాహుల్‌ గాంధీ కోర్టు కార్యకలాపాలకు హాజరు కానవసరం లేదు. ఆయన హాజరు లేకుండానే కేసులో విచారణ కొనసాగుతోంది. అయితే,  విచారణ సమయంలో అవసరమైతే హాజరు కావాలని కోర్టు ఆయన్ను కోరవచ్చు. 2014 ఎన్నికలకు ముందు రాహుల్‌ గాంధీ తన ప్రసంగంలో మహాత్మ గాంధీ మరణానికి ఆర్సెసెస్‌ కారణమని పేర్కొన్న నేపథ్యంలో కుంతే ఈ పరువు నష్టం కేసును దాఖలు చేశారు.

మహారాష్ట్రలోని థానే జిల్లాలోని భివాండీలో రాహుల్‌ గాంధీ ఈ వ్యాఖ్యలు చేశారు. కేసు విచారణ 2014 నుంచి మహారాష్ట్రలోని భివాండీ జ్యుడీషియల్‌ మేజిస్ట్రేట్‌ ముందు కొనసాగుతోంది. రాహుల్‌ గాంధీ జూన్‌ 2018లో మేజిస్ట్రేట్‌ ముందు హాజరై, నిర్దోషి అని తెలిపిన తర్వాత విచారణ ప్రారంభమైంది. 2022లో రాహుల్‌ గాంధీ తాను పార్లమెంట్‌ సభ్యుడిగా ఉన్నందున తన నియోజకవర్గాన్ని సందర్శించి పార్టీ కార్యక్రమానికి హాజరుకావాల్సి ఉన్నందున కోర్టుకు హాజరు కాకుండా శాశ్వత మినహాయింపు కోరుతూ దరఖాస్తును సమర్పించారు.

Related Posts

Latest News Updates