విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ కు కేంద్రం కుట్ర చేస్తోందని మంత్రి కేటీఆర్ విమర్శించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని, ప్రభుత్వ రంగ సంస్థలను విక్రయిస్తే ఉద్యోగులు నష్టపోతారని అన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలకు బీఆర్ఎస్ ప్రభుత్వం పెద్దపీట వేసిందని, ప్రభుత్వ రంగ సంస్థలను ప్రోత్సహించాలనే లక్ష్యంతో.. బీహెచ్ఇఎల్ కు నేరుగా అధిక ఆర్డర్లు ఇచ్చిన రాష్ట్రం తెలంగాణ అని మంత్రి పేర్కొన్నారు. తెలంగాణ భవన్ లో మంత్రులు అజయ్, సత్యవతి రాథోడ్, పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి కేటీఆర్ మాట్లాడారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను కావాలనే నష్టాల్లోకి నెట్టేశారని ఆరోపించారు. నష్టాలను జాతికి అంకితం చేసి, లాభాలను దోస్తులను పంచడమే ప్రధాని విధానమని విమర్శించారు.
విశాఖ ఉక్కుకు, బయ్యారం స్టీల్ ప్లాంట్‌కు మధ్య ఉన్న ముఖ్యమైన సంబంధం బైలదిల్లాలో ఉండే ఐరన్ ఓర్ అని మంత్రి కేటీఆర్ వివరించారు. బైలదిల్లా అనేది ఛత్తీస్‌గఢ్ నుంచి ఒడిశా దాకా వ్యాపించిన ఐరన్ ఓర్ గని అని, ఇది చాలా పెద్ద గని అని అన్నారు. 134 కోట్ల మెట్రిక్ టన్నుల ఐరన్ ఓర్ ఉన్న గని బైలదిల్లా అని, భౌగోళికంగా చూస్తే ఇది బయ్యారం నుంచి 150-160 కిలోమీటర్ల దూరంలో ఉందని వివరించారు. వైజాగ్ నుంచి 600 కిలోమీటర్ల దూరంలో ఉంది. బైలదిల్లాలో నాణ్యమైన ఐరన్ ఓర్ ఉందని కేంద్ర ప్రభుత్వ సంస్థలే తేల్చిచెప్పాయి అని వెల్లడించారు.
2014లో రాష్ట్రం ఏర్పడినప్పుడు బయ్యారంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేస్తామని ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో వివరంగా చెప్పారని మంత్రి కేటీఆర్ గుర్తు చేశారు. అదేవిధంగా కడపలో కూడా స్టీల్ అధారిటీ ఆఫ్ ఇండియా ద్వారా అక్కడ స్టీల్ ప్లాంట్ పెట్టే అవకాశాన్ని పరిశీలిస్తామని పేర్కొన్నారు. తెలంగాణలోని బయ్యారం గురించి మేం అడగగలం కాబట్టి.. 2014 నుంచి అడుగడుగున ప్రశ్నిస్తూ వస్తున్నామన్నారు. దీని గురించి ఎందుకు పట్టించుకోవడం లేదని సీఎం కేంద్రానికి ఉత్తరాలు రాశారని, పరిశ్రమల మంత్రిగా కొన్నిరోజులు మైన్స్ డిపార్ట్‌మెంట్ చూసిన సమయంలో కేంద్రమంత్రులను కలిశానని అన్నారు.