రాజస్థాన్ కాంగ్రెస్ లో సంక్షోభం మళ్లీ ముదిరిపోయింది. ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ అవినీతిపై చర్యలు తీసుకోవడం లేదని, అందుకు నిరసనగా ఒక రోజు దీక్షకు దిగారు యువ నేత, మాజీ డిప్యూటీ సీఎం సచిన్ పైలట్. సీఎం గెహ్లోత్ ను, పార్టీని ఇరుకున పెట్టే చర్యలు చేయవద్దని, దీక్షకు కూర్చోవద్దని హైకమాండ్ వారించినా… సచిన్ పైలట్ దీక్షకు కూర్చున్నారు. రాజస్థాన్‌లోని గత బీజేపీ ప్రభుత్వ అవినీతిపై చర్యలకు డిమాండ్ చేస్తూ ఆ రాష్ట కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ జైపూర్‌లోని సహీద్ సమార్క్ వద్ద మంగళవారం మధ్యాహ్నం నిరాహార దీక్షకు దిగారు.
సాయంత్రం వరకూ దీక్షలోనే వుంటానని పైలట్ ప్రకటించారు. మాజీ సీఎం వసుంధర రాజే హయాంలో జరిగిన అవినీతిపై చర్యలు తీసుకోవడంలో అశోక్ గెహ్లాత్ ప్రభుత్వం విఫలమైందని పైలట్ మండిపడ్డారు. ఆ కేసులపై దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. ఇది ప్రభుత్వానికి వ్యతిరేకంగానో, నాయకత్వం అంశంగానో భావించరాదని, అవినీతికిపై చర్యలకు కాంగ్రెస్ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని అన్నారు. ఇచ్చిన హామీ, చేసే పనులు ఒకటిగా ఉండాలని అన్నారు.
అవినీతిపై చర్యలకు డిమాండ్ చేస్తూ సచిన్ పైలట్ ఒకరోజు నిరసన పిలుపుపై కాంగ్రెస్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది పార్టీ వ్యతిరేక చర్యగా పరిగణించాల్సి వస్తుందని హెచ్చరించింది. సచిన్ పైలట్ తలబెట్టిన ఒకరోజు నిరసనపై ఆ పార్టీ రాజస్థాన్ ఇన్‌చార్జి సుఖ్జిందర్ సింగ్ రాంధ్వా సోమవార సాయంత్రం ఒక ప్రకటన చేస్తూ, ఇది పార్టీ ప్రయోజనాలకు మంచిది కాదన్నారు. పార్టీ వ్యతిరేక కార్యక్రమంగా దీనిని భావించాల్సి వస్తుందని చెప్పారు. ప్రభుత్వంతో ఏదైనా సమస్య ఉంటే దానిని బహిరంగంగా లేదా మీడియా ముందు కాకుండా పార్టీ వేదికలపైనే చర్చించుకోవాలన్నారు.