ప్రధాని మోదీ  కేవలం రాజకీయాల కోసమే  హైదరాబాద్‌ వచ్చారని మంత్రి కేటీఆర్‌   విమర్శించారు. మోదీ హైదరాబాద్‌ పర్యటనపై మంత్రి కేటీఆర్‌ స్పందించారు.  గడిచిన తొమ్మిదేండ్లలో తెలంగాణలా  అభివృద్ధి సాధించిన రాష్ట్రాన్ని ప్రధాని చూపించాలని డిమాండ్‌ చేశారు. దేశంలోనే అత్యుత్తమ ఇండస్ట్రియల్‌ పాలసీ కలిగిన రాష్ట్రం తెలంగాణ అని, దేశ జీడీపీ వృద్ధికి తోడ్పడుతున్న రాష్ట్రాల్లో నాలుగో స్థానంలో ఉన్నదని చెప్పారు. ప్రతి ఇంటికి తాగునీరు సరఫరా చేస్తున్న మొదటి రాష్ట్రమని, దేశంలోనే అత్యధికంగా వరిని ఉత్పత్తి చేస్తున్న రెండో రాష్ట్రం తెలంగాణ అన్నారు. ఎన్నో అంతర్జాతీయ ప్రశంసలు అందుకున్న తెలంగాణ గురించి ప్రధాని నోటినుంచి ఒక్క అభినందన కూడా రాలేదంటూ విమర్శించారు.  దేశంలోని అత్యధిక తలసరి వృద్ధి కలిగిన రాష్ట్రం తెలంగాణ.  ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టును పూర్తిచేయడంతోపాటు దేశంలో ఉత్తమ గ్రామీణ అభివృద్ధి నమూనా కలిగి వంద శాతం ఓడీఎఫ్‌ ప్లస్‌ సాధించాం. ఐటీ రంగంలో ఉద్యోగ కల్పనలో దేశంలోనే ముందంజలో ఉన్నాం. తెలంగాణలో గ్రీన్‌ కవర్‌ వృద్ధి 7.7 శాతంగా ఉన్నది. దేశంలో అత్యధిక అవార్డులు అందుకున్న రాష్ట్రంగా తెలంగాణ రెండో స్థానంలో ఉన్నది.

దేశంలో అత్యుత్తమ పారిశ్రామిక విధానం, అతిపెద్ద టెక్స్‌టైల్‌ పార్కు, ప్రపంచ వ్యాక్సిన్‌ హబ్‌లు తెలంగాణ ప్రత్యేకతలు. తాజాగా విడుదలైన సీఎస్‌డీఎస్‌ నివేదిక ప్రకారం దేశంలో అతితక్కువ అవినీతి ఉన్న రాష్ట్రం తెలంగాణ. ఎన్నో అంతర్జాతీయ ప్రశంసలు అందుకున్న తెలంగాణ గురించి ప్రధాని మోదీ నోటి నుంచి ఒక్క అభినందనా రాలేదు. రాజకీయాల కోసం అత్యుత్తమ పర్ఫార్మింగ్‌ రాష్ట్రంగా తెలంగాణను ప్రధాని అంగీకరించలేకపోతున్నారు కేటీఆర్‌ విమర్శించారు. గడిచిన 9 ఏండ్లలో తెలంగాణతో సమానంగా వృద్ధి సాధించిన రాష్ట్రాన్ని చూపించగలరా అని మోదీజీ అంటూ ప్రధానికి సవాల్‌ విసిరారు.