తాము రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దామంటే కేసీఆర్ ప్రభుత్వం మోకాలడ్డుతోందన్న ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలు ఘాటుగా స్పందించారు. కేంద్రం ఏమిచ్చిందని రాష్ట్రం అభివృద్ధిని అడ్డుకుంటుందని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ప్రశ్నించారు. మంత్రులు గంగుల కమలాకర్‌, శ్రీనివాస్‌ గౌడ్‌, ఎమ్మెల్సీ యెగ్గే మల్లేశంతో కలిసి బీఆర్‌ఎస్‌ ఎల్పీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ.. మోదీ అధికార కార్యక్రమంలో రాజకీయాలు మాత్రమే మాట్లాడారన్నారు. తెలంగాణపై ఆయనకు ప్రేమలేదని, ఇందుకు గతంలో రాష్ట్ర ఏర్పాటుపై చేసిన వ్యాఖ్యలే నిదర్శనమన్నారు. వందే భారత్‌ రైళ్లను మోదీ ఎన్నిసార్లు ప్రారంభిస్తారని ప్రశ్నించారు. అభివృద్ధి రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకుంటుందని మోదీ అన్నారని, కేంద్రం ఏమిచ్చిందని అడ్డుకోవడానికని నిలదీశారు.

అవినీతి కుటుంబ పాలన గురించి మాట్లాడే హక్కు మోదీకి ఉందా? అని నిలదీశారు. బీజేపీలో కుటుంబ రాజకీయాలు లేవా? బీజేపీ సీఎంలు అవినీతిలో కూరుకుపోతే విచారణలు ఎందుకు ఉండవన్నారు. ఏ రంగంలో తెలంగాణ వెనకబడిందో మోదీ చెప్పాలన్నారు. ఒక్క మెడికల్ కాలేజీ అయినా తెలంగాణకు ఇచ్చారా ..? జాతీయ రహదారులు ఎవరన్నా వస్తాయన్నారు. అందులో మోదీ గొప్ప ఏముందన్నారు. దేశానికి తెలంగాణ సమకూరుస్తున్న ఆదాయం ఎంత? కేంద్రం నుంచి ఇచ్చింది ఎంత ..? కరోనాకు వ్యాక్సిన్ కూడా తానే కనిపెట్టాను అన్నట్టుగా మోదీ మాట్లాడుతారని, ప్రోటోకాల్ ఉల్లంఘనకు తెరలేపింది మోదీయేనన్నారు.

అవినీతి గురించి మోదీ మాట్లాడుతున్నారని.. అదానీ అవినీతి సంగతేంటని మంత్రి తలసాని ప్రశ్నించారు. శ్రీలంకలో అదానీకి వచ్చిన కాంట్రాక్టు ఎవరి ద్వారా వచ్చింది ? అదానీ మోసాలపై జేపీసీ వేయమంటే ఎందుకు వేయరన్నారు. తెలంగాణ అభివృద్ధి గురించి మోదీ నాతో చర్చకు వస్తారా? అని సవాల్ విసిరారు. తెలంగాణ అభివృద్ధి సాధించకపోతే కేంద్రం ఇన్ని అవార్డులు ఎందుకు ఇస్తోందన్నారు. తలసరి ఆదాయంలో తెలంగాణ నెంబర్ వన్ అవునో కాదో ..? మోదీయే చెప్పాలని మంత్రి తలసాని డిమాండ్ చేశారు.