తెలుగు రాష్ట్రాల్లో రెండో వందేభారత్ పట్టాలెక్కింది. ప్రధాని మోదీ పచ్చ జెండా ఊపి సికింద్రాబాద్ – తిరుపతి వందేభారత్ ను ప్రారంభించారు. మూడు నెలల కాలంలో తెలుగు రాష్ట్రాల్లో ఇది రెండో వందే భారత్. ఐటీ సిటీ టు టెంపుల్ సిటీకి వందేభారత్ అందుబాటులోకి వచ్చింది. అదే సమయంలో దక్షిణ మధ్య రైల్వే ప్రధాన కేంద్రంగా ఉన్న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. ఎంఎంటీఎస్ ఫేజ్ 2లో భాగంగా 13 కొత్త సర్వీసులను ప్రారంభించారు. ప్రధాని మోదీ హైదరాబాద్ చేరుకున్నారు. బేగంపేట విమానాశ్రయం నుంచి నేరుగా సికింద్రాబాద్ స్టేషన్ కు వచ్చారు. అక్కడ ముందుగా నిర్ణయించిన విధంగా సికింద్రాబాద్ – తిరుపతి వందేభారత్ ను ప్రధాని ప్రారంభించారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ  11-30 గంటలకు బేగంపేట్ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. మోదీకి స్వాగతం పలికేందుకు బీజేపీ శ్రేణులు పెద్ద ఎత్తున ఎయిర్ పోర్టుకు తరలి వచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రోటోకాల్ ప్రకారం గవర్నర్ తమిళిసై తోపాటు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్  మరోవైపు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ , ఎంపీ అరవింద్ , ఎమ్మెల్యేలు ఈటల , రఘనందన్ రావు , సీఎస్ శాంతి కుమారి , డీజీపీ , విమానాశ్రయానికి చేరుకుని ప్రధాని మోదీకి స్వాగతం పలికారు. ప్రధానితోపాటు వారంతా రోడ్డు మార్గం ద్వారా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు చేరుకున్నారు.