కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలంగాణ డీజీపీ అంజనీ కుమార్ కి ఫోన్ చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ని ఎందుకు అరెస్ట్ చేశారని డీజీపీని ప్రశ్నించారు. అసలు అరెస్ట్ చేయడానికి కారణాలేంటని అడిగారు. అయితే… కేసు వివరాలు కాసేపటి తర్వాత తెలియజేస్తామని డీజీపీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి సమాధానమిచ్చారు. ఈ సమాధానంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ ఎంపీని, ఓ జాతీయ పార్టీ అధ్యక్షుడ్ని ఎందుకు అరెస్ట్ చేశారో డీజీపీకి కూడా తెలియదని, దీనిని బట్టి తెలంగాణలో పోలీసు వ్యవస్థ ఎలా వుందో అర్థం చేసుకోవచ్చని దెప్పిపొడిచారు.

 

తెలంగాణలో పోలీసులు వ్యవహరిస్తున్న తీరు దురృష్టకరమన్నారు. కల్వకుంట్ల కుటుంబానికి కట్టుబానిసలుగా వ్యవహరించొద్దంటూ పోలీసులకు కిషన్ రెడ్డి సూచించారు. ప్రభుత్వ వైఫల్యాలపై తాము ఎనలేని పోరాటం చేస్తున్నామని, అందుకే బండి సంజయ్ ని అరెస్ట్ చేశారని మండిపడ్డారు. కేసీఆర్ ప్రభుత్వమే లీకేజీల ప్రభుత్వమని, ఏదైనా లీకేజీయే అవుతుందని ఎద్దేవా చేశారు.

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ని మంగళవారం అర్ధరాత్రి 12 గంటలకు పోలీసులు అరెస్ట్ చేశారు. అసలు ఏ కేసులో అరెస్ట్ చేస్తున్నారో కూడా చెప్పకుండా, ఎలాంటి వారెంట్ కూడా లేకుండానే బలవంతంగా అదుపులోకి తీసుకున్నాయి. అసలు ఏ విషయంలో అరెస్ట్ చేస్తున్నారని బండి సంజయ్ పోలీసు అధికారులను అడిగినా…. పోలీసులు జవాబు చెప్పలేదు. సంజయ్ అత్తమ్మ చనిపోయి బుధవారానికి 9వ రోజు కావడంతో.. ఆ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఇంటికి చేరుకున్న కొద్దిసేపటికే ఈ ఘటన జరిగింది.

అయితే, పదో తరగతి ప్రశ్న పత్రాల లీకేజీ కేసులోనే సంజయ్‌ను పోలీసులు అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. తనను ఎందుకు అరెస్టు చేస్తున్నారో చెప్పాలని సంజయ్‌ కోరితే, అదుపులోకి తీసుకునే అధికారం తమకు ఉందంటూ పోలీసులు జవాబు ఇచ్చారని బీజేపీ వర్గాలు తెలిపాయి. తొలుత, అర్ధరాత్రి 12 గంటలు దాటిన తర్వాత సుమారు 100 మంది పోలీసులు సంజయ్‌ ఇంటిని చుట్టుముట్టారు. ఆయన అరెస్టుకు ప్రయత్నించారు. అదే సమయంలో బీజేపీ కార్యకర్తలు కూడా అక్కడికి చేరుకున్నారు. దాంతో, బండి సంజయ్‌ నివాసం వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.