అమెరికా-కెనడా బార్డర్ లో విషాదకర ఘటన చోటు చేసుకుంది. అక్రమంగా సరిహద్దులు దాటేందుకు యత్నించిన ఎనిమిది మంది మృత్యువాత పడ్డారు. కెనడా నుంచి అక్రమంగా అమెరికాలోకి ప్రవేశించే ప్రయత్నంలో పడవ మునిగి మృతిచెంది ఉంటారని పోలీసులు తెలిపారు. మృతుల్లో ఆరుగురు పెద్దవారు, ఇద్దరు చిన్నారులు ఉన్నారు. చిన్నారులు కెనడాకు చెందిన వారని పాస్‌పోర్టుల ద్వారా తెలిసిందని, వీరిని భారత్, రొమేనియా కుటుంబాలుగా గుర్తించినట్టు వెల్లడించారు.
అక్వెసాస్నేలోని మోహవ్క్ సరిహద్దు క్యూబెక్ పరిధిలోని సెయింట్ లారెన్స్ నదిలో ఈ ఘటన జరిగింది. వీరంతా కెనడా నుంచి సెయింట్ లారెన్స్ నది మీదుగా పడవలో అమెరికాలోకి అక్రమంగా ప్రవేశిస్తుండగా, జరిగిన బోటు ప్రమాదంలో మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించారు. కెనడా-అమెరికా సరిహద్దులోని సెయింట్ లారెన్స్ నదిలోని చిత్తడి ప్రాంతంలో వీరి మృతదేహాలను గుర్తించినట్టు పోలీసులు వెల్లడించారు.