దక్షిణ భారత దేశంలోనే అతిపెద్ద బహు ళ అంతస్థుల భవనం హైదరాబాద్‌ ఐటీ కారిడార్‌లో నిర్మితమవుతున్నది. కోకాపేటలో  సాస్‌ క్రౌన్‌  పేరి ట 58 అంతస్థులు 236 మీటర్ల ఎత్తుతో ఈ ఆకాశ హర్మ్యాన్ని నిర్మిస్తున్నారు. హైదరాబాద్‌ ఔటర్‌ రింగురోడ్డు పక్కనే కొలువుదీరుతున్న ఈ భవనంలో ఇప్పటికే 24 అంతస్థుల (సుమారు 100 ఎత్తు) నిర్మాణం పూర్తయింది. మిగిలిన 136 మీటర్ల నిర్మాణం మరో ఏడాదిలో పూర్తి కానున్నట్టు సమాచారం. ఇప్పటికే భారీ బహుళ అంతస్థుల భవనాలు పదుల సంఖ్యలో ఉన్న ఐటీ కారిడార్‌లో సాస్‌ క్రౌన్‌ తర్వాత 57, 56, 52, 50 అంతస్థులతో కూడిన భవనాలు నిర్మాణంలో ఉన్నాయి. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో ఇప్పటివరకు 157 భారీ బహుళ అంతస్థుల భవనాల నిర్మాణాలకు అనుమతులు లభించాయి. 21 నుంచి 58 అంతస్థుల మేరకు ఉండే ఈ భవనాల్లో కొన్ని నిర్మాణ దశలో ఉండగా, మరికొన్ని భవనాల నిర్మాణం ఇప్పటికే పూర్తయింది. వీటిలో వ్యాపార భవనాలతోపాటు నివాస భవనాలు ఉన్నాయి.