TSPSC పేపర్ లీకేజీపై విచారణ చేయాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఈడీని కోరారు. ఈ మేరకు రేవంత్ రెడ్డి హైదరాబాద్ లోని ఈడీ కార్యాలయానికి వెళ్లి అధికారులను కలుసుకున్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ… మంత్రి కేటీఆర్ కి వందకోట్లు ఇస్తే ఎన్ని బూతులైనా తిట్టొచ్చా అంటూ విరుచుకుపడ్డారు. తన పరువు వంద కోట్లు అని ఎలా నిర్ధారిస్తారని ప్రశ్నించారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ను అవినీతిపరులకు అడ్డాగా మార్చేశారని మండిపడ్డారు. చైర్మన్ ,మెంబర్ పై ఏదో ఒక ఆరోపణ వుందని, అనర్హులను సభ్యులుగా నియమించారని ఆరోపించారు.
ఉద్యోగాలు రాక వందలాది మంది చనిపోయినా… కల్వకుంట్ల కుటుంబానికి చీమ కుట్టినట్టైనా లేదన్నారు. ఓ వైపు పేపర్లు లీక్ అవుతుంటే… ఇతర రాష్ట్రాల్లో పార్టీ విస్తరణపై ముఖ్యమంత్రి కన్నేశారని మండిపడ్డారు. మరోవైపు జూబ్లీహిల్స్ లో పార్టీలు చేసుకోవడంలో మంత్రి కేటీఆర్ బిజీ అయిపోయారన్నారు.
ఆధారాలు బయటపెట్టిన ప్రతిపక్షాలకు సిట్ ద్వారా నోటీసులు ఇచ్చి భయపెడుతున్నారని, ఇదో ఆటవికమైన చర్య అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐటీ మంత్రి కేటీఆర్ మొదలు… పబ్లిక్ సర్వీసు కమిషన్ లో వున్న చిన్న స్థాయి ఉద్యోగా వరకూ ఈడీ విచారించాలని, సిట్ నుంచి అన్ని ఆధారాలు తీసుకొని విచారణ చేయాలని తాము కోరినట్లు వెల్లడించారు. పబ్లిక్ డొమైన్ లో లేని సమాచారం మంత్రి కేటీఆర్ కి ఎలా వచ్చిందని మండిపడ్డారు.
ఆధారాలు బయట పెడితే.. తమమీదే కేసులు పెడుతున్నారని, శంకర్లక్ష్మి నుంచే నేరం మొదలైతే.. ఆమెనే సాక్షిగా పెట్టారని రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పేపర్ లీక్ కేసు లో ప్రభుత్వ పెద్దలకు సంబంధాలు ఉన్నాయని, ప్రభుత్వ పెద్దలను తప్పించడానికే సిట్ను నియమించారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. పెద్దలను కాపాడి దిగువస్థాయి ఉద్యోగులను బలి చేస్తున్నారని, పేపర్ లీక్ కేసులో విదేశాల్లో ఉన్నవారితో హవాలా రూపంలో నగదు చేతులు మారిందన్నారు.