సింగపూర్ లో శోభాయమానంగా శ్రీవారి కళ్యాణ మహోత్సవం

సింగపూర్ తెలుగు సమాజం ఆధ్వర్యంలో లోక కళ్యాణార్ధం, రాబోవు సంవత్సరమంతా అందరికీ శ్రేయస్కరంగా ఉండాలనే మహా సంకల్పంతో శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది పర్వదినాన ఎన్నారైలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ శ్రీనివాసునకు సుప్రభాతసేవ, తోమాలసేవ, అభిషేకం, విశేషపూజలతో పాటు విష్ణుదుర్గ అమ్మవారికి అభిషేకము మొదలగు విశేష కైంకర్యములతో శ్రీవారి కళ్యాణోత్సవాన్ని స్థానిక సెరంగూన్ రోడ్‌లోని శ్రీ శ్రీనివాస పెరుమాళ్ దేవాలయంనందు  అత్యంత భక్తిశ్రద్ధలతో, శాస్త్రోక్తంగా, కోలాహలంగా గోవింద నామస్మరణల మధ్య నిర్వహించారు. సింగపూర్ తెలుగు సమాజం శోభాయమానంగా ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. దీంతో వారాంతము కాకపోయినూ భారీగా తరలివచ్చిన భక్తకోటి ఆ దేవదేవుని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఇంత భారీగా నిర్వహించిన తెలుగు సమాజానికి అందరూ కృతజ్ఞతలు తెలిపారు.

తెలుగు సమాజం అధ్యక్షులు కోటిరెడ్డి మాట్లాడుతూ తెలుగు వారందరికీ శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలపటంతో పాటు ఈ సంవత్సరం అందరికీ బాగుండాలని ఆకాంక్షించారు. కళ్యాణోత్సవంలో పాల్గొన్న దంపతులకు తిరుమల తిరుపతి దేవస్థానం మరియు తి. తి. దే. కార్యవర్గ సభ్యులు శ్రీ చెవిరెడ్డి భాస్కరరెడ్డి సహాయ సహకారాలతో తీసుకొని వచ్చిన తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ, వడ ప్రసాదాలను, మంగళ ద్రవ్యాలను, బహుమానాన్ని అందజేసామని తెలిపారు.

కార్యక్రమానికి అన్నివిధాల సహకరించిన పెరుమాళ్ దేవస్ధాన కార్యవర్గాలకు, దాతలకు, కళ్యాణోత్సవంలో పాల్గొన్న దంపతులకు, భక్తులకు, పంచాంగ శ్రవణం చేసిన పండితులకి, వాలంటీర్లకు, కార్యక్రమానికి హాజరైన మరియు లైవ్ ద్వారా వీక్షించిన అందరికీ కార్యదర్శి సత్యచిర్ల ఈ సందర్భంగా ధన్యవాదములు తెలియజేశారు.

Related Posts

Latest News Updates