అంతరిక్ష ప్రయోగాల్లో భారత్ తిరుగులేని శక్తిగా అవతరించింది. భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో చేపట్టిన జీఎస్‌ఎల్వీ మార్క్-3 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. యూకే కంపెనీ వన్‌వెబ్‌కు చెందిన 36 ఉపగ్రహాలను విజయవంతంగా నిర్ధేశిత కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. తిరుపతి జిల్లా సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్)లోని రెండో ల్యాంచ్‌పాడ్ నుంచి ఆదివారం ఉదయం 9 గంటలకు ఎల్‌వీఎం-3 రాకెట్ నిప్పులు చిమ్ముతూ ఆకాశంలోకి దూసుకెళ్లింది. 20 నిమిషాలపాటు ప్రయాణించి భూమికి 450 కిలోమీటర్ల ఎత్తులోని లియో ఆర్బిట్‌లో ఉపగ్రహాలను ప్రవేశపెట్టింది. ఈ ప్రయోగం విజయవంతం కావడంతో ఇస్రో సిబ్బంది అభినందనలు తెలుపుకున్నారు. ఈ సందర్భంగా ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ శాస్త్రవేత్తలను అభినందించారు. మార్క్-3 ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తిచేశామన్నారు. వాణిజ్య ప్రయోగాలకు ఇస్రో ముందంజలో ఉందని చెప్పారు. జీఎస్‌ఎల్వీ మార్క్-3 రాకెట్‌ను మరింత అభివృద్ధి చేస్తామని వెల్లడించారు.