అకాల వర్షాలతో దెబ్బతిన్న వ్యవసాయ క్షేత్రాలను రైతులను వ్యవసాయాధికారులు, ప్రజాప్రతినిధులతో పరిశీలించి, ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్న రైతన్నలకు భరోసానివ్వాలని మంత్రి కేటీఆర్ పార్టీ క్యాడర్ కి సూచించారు. నష్టపోయిన ప్రాంతాలను పరిశీలిస్తూ రైతన్నలకు విశ్వాసం కల్పించేలా మమేకం కావాలన్నారు. పార్టీ విస్తృతంగా నిర్వహిస్తున్న ఆత్మీయ సమ్మేళనాలు, ఇతర కార్యక్రమాలను సమన్వయ పరుస్తున్న పార్టీ ఇన్చార్జిలు, పార్టీ ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులతో కేటీఆర్ టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం ప్రభుత్వం వేగంగా చేపడుతున్న కార్యక్రమాలను పార్టీ ఎమ్మెల్యేలు పర్యవేక్షించాలన్నారు.సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు పంచాయతీరాజ్ రోడ్ల బలోపేతం అంశంపైనా దృష్టి సారించాలని, వర్షాకాలం లోపల పనులు పూర్తయ్యేలా సమన్వయం చేసుకోవాలన్నారు. గ్రామస్థాయిలో ఉపాధి హామీతో పాటు పంచాయతీరాజ్ శాఖ, పట్టణ ప్రగతి, పల్లె ప్రగతి వంటి కార్యక్రమాల్లో భాగంగా చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల బిల్లుల చెల్లింపుపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించిన నేపథ్యంలో వీటన్నింటిని మరింత వేగంగా ముందుకు తీసుకెళ్లేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచించారు.
వచ్చే నెల 29 నాటికి ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాలు పూర్తి కావాలన్నారు. ఇందుకు సంబంధించి, ఇప్పటికే జిల్లా ఇన్చార్జిలుగా వెళ్లిన వారి ఆధ్వర్యంలో పార్టీ కార్యక్రమాలు విస్తృతంగా కొనసాగుతున్నాయన్నారు. సీఎం కేసీఆర్ ప్రత్యేక కార్యకర్తలు సందేశాన్ని ఇవ్వబోతున్నారన్నారు. దాన్ని అన్ని ఆత్మీయ సమ్మేళనాల్లో చదివి వినిపించానలి, ప్రతి కార్యకర్తకు ఉద్యమ కాలం నుంచి పార్టీకి అండగా ఉంటూ రెండుసార్లు తిరిగి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు దోహదం చేసిన విషయాన్ని వారికి గుర్తు చేస్తూ ముఖ్యమంత్రి పంపే ప్రత్యేక సందేశాన్ని ప్రతి కార్యకర్తకు చేరేలా చూడాలన్నారు.
రాష్ట్రంలో మహిళల అభివృద్ధి కోసం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను మహిళా లోకానికి చేరేలా చూడాలని కేటీఆర్ ఆదేశించారు. దేశంలో ప్రస్తుతం ఉన్న సామాజిక ఆర్థిక పరిస్థితులపైనా కూడా విస్తృతంగా చర్చ జరగాలన్నారు. ముఖ్యంగా మోదీ ప్రభుత్వ హయాంలో పెరిగిన పెట్రోల్ ధరలతో పాటు నిత్యవసర సరుకుల ధరలు మోదీ ప్రభుత్వ విధానాల వైఫల్యాలపై సైతం పార్టీ కార్యకర్తలకు అర్థమయ్యేలా చర్చించి.. ప్రజా బాహుల్యంలోకి తీసుకెళ్లాలా చూడాలని కేటీఆర్ సూచించారు.