తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ పంపిన నోటీసులు తనకు అందాయని బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రకటించారు. పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో ఈ నెల 15 న తాను విచారణకు హాజరు కాలేనని మహిళా కమిషన్ కి లేఖ రాశారు. అయితే… ఈ నెల 18 న కమిషన్ ముందు హాజరు అవుతానని ప్రకటించారు. అయితే… తాను కమిషన్ ముందు హాజరు కావాల్సిన అవసరం ఏముంది? దీనిపై స్పష్టత ఇవ్వాలని బండి సంజయ్ లేఖలో డిమాండ్ చేశారు. ఆ వివరాలు తనకు పూర్తిగా తెలిపితే… కమిషన్ ముందు వివరణ ఇచ్చేందుకు పూర్తి సౌలభ్యంగా వుంటుందని తెలిపారు.బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో బండి సంజయ్ పై విమర్శలు వచ్చాయి. ఈ వ్యాఖ్యలను మహిళా కమిషన్ సుమోటోగా స్వీకరించింది. ఈ నెల 15 వ్యక్తిగతంగా హాజరు కావాలని మహిళా కమిషన్ తన నోటీసుల్లో బండి సంజయ్ కి సూచించింది.

 

ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన అనుచిత వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. సంజయ్ వాఖ్యలను వ్యతిరేకిస్తూ రెండ్రోజుల క్రితం బీఆర్ఎస్ శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టారు. బండి సంజయ్ కవితకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. సంజయ్ చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలతో పాటు సొంత పార్టీ బీజేపీకి చెందిన కొందరు నేతలు కూడా వ్యతిరేకించారు.