బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి, సీబీఐ మాజీ డైరెక్టర్ కె. విజయ రామారావు (85) తుది శ్వాస విడిచారు. సోమవారం మధ్యాహ్ం తన ఇంట్లో బ్రెయిన్ స్ట్రోక్ తో తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో ఆయన కుటుంబీకులు అపోలోకి తరలించారు. రాత్రి 8 గంటల ప్రాంతంలో తుది శ్వాస విడిచారు. మెదడులో తీవ్ర రక్తస్రావం కావడంతో లోపల అన్ని భాగాలు దెబ్బతినడం వల్ల మరణించారని వైద్యులు పేర్కొన్నారు. విజయ రామారావు మరణం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో పాటు పలువురు నేతలు సంతాపం ప్రకటించారు. మరోవైపు అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ఆయన చిన్న కుమారుడు అమెరికా నుంచి రాగానే… బుధవారం మహా ప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహిస్తామని కుటుంబీకులు పేర్కొన్నారు.
విజయ రామారావు స్వస్థలం ములుగు జిల్లా ఏటూరు నాగారం. 1937 ఏప్రిల్ 4 న జన్మించారు. చెన్నై క్రిస్టియన్ కాలేజీ నుంచి ఎంఏ పట్టా అందుకున్నారు. 1959 లో ఐపీఎస్ గా ఎన్నికయ్యారు. ఆ తర్వాత పలు హోదాల్లో సేవలందించారు. సీబీఐ డైరెక్టర్ గా పదవీ విరమణ చేసిన తర్వాత తెలుగు దేశంలో చేరారు. 1999 లో ఖైరతాబాద్ నుంచి గెలుపొందారు. చంద్రబాబు మంత్రి వర్గంలో రోడ్లు, భవనాల శాఖ చేశారు. అయితే.. 2004 లో ఓడిపోయారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత.. టీడీపీకి రాజీనామా చేసిన తర్వాత బీఆర్ఎస్ లో చేరారు.
ప్రభుత్వ అధికారిగా, ప్రజా ప్రతినిధిగా విజయరామారావు అందించిన ప్రజా సేవలు గొప్పవని అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో, అనంతరం తెలంగాణ రాష్ట్రంలో విజయరామారావుతో తనకున్న అనుబంధాన్ని ఈ సందర్భంగా సీఎం స్మరించుకున్నారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని సీఎం ప్రార్థించారు. విజయరామారావు కుటుంబ సభ్యులకు సీఎం తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.