దుబాయ్‌లో శిక్ష అనుభవిస్తున్న తెలంగాణకు చెందిన ఐదుగురు ప్రవాస భారతీయులను విడుదల చేయాలని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రభుత్వానికి రాష్ట్ర మంత్రి కేటీఆర్( Minister KTR ) సోమవారం విజ్ఞప్తి చేశారు. ప్రగతిభవన్‌లో తనతో సమావేశమైన యూఏఈ( UAE ) రాయబారి అబ్దుల్ నసీర్ అల్శాలికి మంత్రి కేటీఆర్ పలు వివరాలను అందజేశారు. రాజన్న సిరిసిల్లాకు చెందిన మల్లేష్, నాంపల్లి వెంకట్, దుండుగుల లక్ష్మణ్, శివరాత్రి హనుమంతులు ప్రస్తుతం దుబాయ్ లో ఒకే కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్నారు. 2005 లో నేపాల్ దేశానికి చెందిన దిల్ ప్రసాద్ రాయ్ మరణం విషయంలో వీరు జైల్లో వున్నారు. షరియా చట్టాల ప్రకారం 15 లక్షల పరిహారాన్ని బాధితుని కుటుంబం స్వీకరించేందుకు అంగీకరించిందని, 2013 లో తానే స్వయంగా నేపాల్ వెళ్లి, బాధిత కుటుంబాన్ని కలుసుకున్నానని కేటీఆర్ వారికి వివరించారు.
Minister @KTRBRS handed over a letter to Ambassador of UAE to India, H.E. Dr. @aj_alshaali, requesting the Government of United Arab Emirates to release 5 NRIs belonging to Rajanna Sircilla from Dubai prison. pic.twitter.com/mJ1PrBwDup
— Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) March 13, 2023
అయితే యూఏఈ కోర్టు వీరి క్షమాభిక్ష పిటిషన్ తిరస్కరించిందని, ఇక దుబాయ్ రాజు షేక్ మహ్మద్ బిన్ రషీద్ క్షమాభిక్ష పెడితేనే బాధితులకు విముక్తి లభిస్తుందని సూచించారు. రియా చట్టంలోని ప్రకారం బాధితుల కుటుంబం క్షమాపణ పత్రం అందిస్తే వీరిని విడుదల చేసే అవకాశం ఉందని, ఈ మేరకు బాధితుని కుటుంబం 2013లోనే అవసరమైన అన్ని రకాల డాక్యుమెంట్లను దుబాయ్ ప్రభుత్వానికి ఇచ్చిందని కేటీఆర్ తెలిపారు.
ఇప్పటికే అటు భారత దౌత్య కార్యాలయంతో పాటు యూఏఈ దౌత్య కార్యాలయానికి సైతం ఈ విషయంలో అనేకసార్లు తాను స్వయంగా విజ్ఞప్తి చేసినట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. తాను వివరించిన ఈ సంఘటన తాలూకు వివరాలను అటు భారత, నేపాల్ దౌత్య కార్యాలయాల ద్వారా విచారించుకోవాలన్నారు. క్షమాభిక్షకు అర్హమైన ఈ కేసులో, దుబాయ్ రాజు సానుకూలంగా స్పందించేలా ఆయన దృష్టికి తమ విజ్ఞప్తిని తీసుకురావాలని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ యూఏఈ రాయబారిని కోరారు.