తెలంగాణ రాజ్ భవన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఎమ్మెల్సీ కవితపై బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను… ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ గవర్నర్ ను కోరేందుకు హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మీ, బీఆర్ఎస్ ఎమ్మెల్యే గొంగడి సునీత, జీహెచ్ఎంసీ మేయర్లు రాజ్ భవన్ కి చేరుకున్నారు. రాజ్ భవన్ లోకి వెళ్లేందుకు బీఆర్ఎస్ నేతలు ప్రయత్నించారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. మేయర్, బీఆర్ఎస్ కార్పొరేటర్లను పోలీసులు అడ్డుకున్నారు.

గవర్నర్ అపాయింట్ మెంట్ లేదని, అనుమతి ఇవ్వడం కుదరదని పోలీసులు తేల్చి చెప్పారు. దీంతో మేయర్ విజయలక్ష్మీ, కార్పొరేటర్లు, ఎమ్మెల్యే సునీత తదితరులు రాజ్ భవన్ ముందు బైఠాయించారు. బండి సంజయ్ కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఉదయం నుంచి గవర్నర్   అపాయింట్ మెంట్ అడిగినా  ఇవ్వడం లేదని కార్పొరేటర్లు ఆరోపించారు.  గవర్నర్ అపాయింట్ మెంట్ ఇచ్చే వరకు ఆందోళన చేస్తామన్నారు. బండి సంజయ్ క్షమాపణలు చెప్పాలని ఎమ్మెల్యే గొంగిడి సునీత డిమాండ్ చేశారు.  అయితే గవర్నర్ తమిళి సై అపాయింట్ మెంట్ ఖరారు కాలేదని రాజ్ భవన్ వర్గాలు తెలిపాయి.