ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఈడీ ముందు విచారణకు హాజరయ్యారు. ఈ రోజు ఉదయం ఢిల్లీలోని తన నివాసం నుంచి ఈడీ కార్యాలయానికి కవిత వెళ్లారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్ నుంచే ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షిస్తున్నారు. ఇదిలా వుండగా… మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నేతలందరూ ఢిల్లీకి చేరుకోవాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. కవితకు నైతిక మద్దతుగా ఢిల్లీ వెళ్లాలని సూచించారు. ఇప్పటికే మొదటగా మంత్రి కేటీఆర్ శుక్రవారం రాత్రి బయల్దేరారు. ఆ తర్వాత హరీశ్ రావు బయల్దేరారు.
ఈ ముగ్గురూ ఢిల్లీలో శుక్రవారం రాత్రి న్యాయ నిపుణులు, పార్టీ లీగల్ సెల్ తో సమావేశమై చర్చించారు. తాజాగా… మంత్రులు, ఎమ్మెల్యేలు ఢిల్లీ వెళ్లాలని కేసీఆర్ ఆదేశించారు. ఈ నేపథ్యంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఇతర ఎమ్మెల్యేలు ఢిల్లీ బాటపట్టారు. ఒకవేళ ఈడీ కవితను అరెస్ట్ చేస్తే… ఢిల్లీలో నిరసన వ్యక్తం చేయాలన్నది బీఆర్ఎస్ ప్లాన్ గా తెలుస్తోంది.
లిక్కర్ స్కాంలో విచారణ కోసం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఈడీ ఆఫీసుకు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో ఆమె తన నివాసం నుంచి ఈడీ కార్యాలయానికి కారులో చేరుకున్నారు. ఈ సందర్భంగా కవిత కారుతో పాటు మరొక కారుకు మాత్రమే పోలీసులు అనుమతినిచ్చారు.ఈడీ విచారణకు బయల్దేరిన సమయంలో బీఆర్ఎస్ కార్యకర్తలు, నేతలు జై కవిత… జై కేసీఆర్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈడీ కార్యాలయంలోకి విచారణ నిమిత్తం వెళ్లే ముందుకు కార్యకర్తలకు అభివాదం చేశారు.
మరోవైపు ఎమ్మెల్సీ కవితను ఈడీ విచారించనున్న నేపథ్యంలో ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఒకవేళ ఈడీ అధికారులు కవితను అరెస్ట్ చేస్తే ఆందోళనలు చేసే అవకాశం ఉందని వచ్చిన సమాచారంతో పోలీసులు మరింత అలర్ట్ అయ్యారు. ఈ నేపథ్యంలో చాలాచోట్ల భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇటు సీఎం కేసీఆర్ నివాసం వద్ద కూడా బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు.







