ముఖ్యమంత్రి కేసీఆర్ ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు జారీ చేయడంపై మొదటిసారిగా స్పందించారు. తెలంగాణ భవన్ లో నేడు BRS విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కేసీఆర్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు.కవితను నేడో రేపో అరెస్ట్ చేస్తారట… చేయనివ్వండి… ఏం చేస్తారో చూద్దాం. భయపడే ప్రసక్తి మాత్రం లేదు. అంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. మంత్రులు, ఎంపీల నుంచి కవిత వరకూ వచ్చారని, నోటీసుల పేరుతో నేతలందర్నీ వేధిస్తున్నారని కేసీఆర్ పేర్కొన్నారు. కేంద్రంపై తమ పోరాటం మాత్రం కొనసాగుతుందని కేసీఆర్ స్పష్టం చేశారు. బీజేపీని గద్దె దించే వరకు విశ్రమించొద్దు అని నేతలకు సీఎం కేసీఆర్ సూచించారు.

 

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు షెడ్యూల్ ప్రకారమే వుంటాయని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు స్ప్టం చేశారు. సర్వేలన్నీ తమకే అనుకూలంగా వున్నాయని, ఎన్నికలకు పార్టీ నేతలంతా సిద్ధంగా ఉండాలని సూచించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ భవన్ లో BRS విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగానే సీఎం కేసీఆర్ పై వ్యాఖ్యలు చేశారు. ఎన్నిక‌లు డిసెంబ‌ర్‌లో ఉంటాయ‌ని, ఆ లోపు ఎన్నిక‌ల‌కు ప్లాన్ చేసుకోవాల‌ని కేసీఆర్ సూచించారు. నాయ‌కులంతా నియోజ‌క‌వ‌ర్గాల్లోనే ఉండి ప్ర‌జ‌ల్లోకి వెళ్లాల‌ని ఆదేశించారు. నియోజ‌క‌వ‌ర్గాల్లో వీలైతే పాద‌యాత్ర‌లు చేయాల‌ని చెప్పారు. వీలైన‌న్ని ఎక్కువ‌గా కార్య‌క‌ర్త‌ల స‌మావేశాలు నిర్వ‌హించి, ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌ను ప్ర‌జ‌ల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాల‌ని సూచించారు.

 

కొన్ని రోజులుగా తెలంగాణలో ముందస్తు ఎన్నికలు జరిగే అవకాశాలున్నాయంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్ అందుకు పూర్తి ఏర్పాట్లు చేసుకున్నారన్న వార్తలు కూడా బాగా ప్రచారం నడుస్తోంది. అలాగే ఎవరెవరికి టిక్కెట్లు ఇవ్వాలన్న దానిపై కూడా కేసీఆర్ ఓ క్లారిటీకి వచ్చేశారన్న వార్తలూ వచ్చాయి. దీంతో తెలంగాణలో అన్ని పార్టీలు కూడా అలర్ట్ అయ్యాయి. అటు కాంగ్రెస్, ఇటు బీజేపీ కూడా ఇప్పటికే ఎన్నికల మూడ్ లోకి వెళ్లిపోయాయి. కానీ… తాజా కేసీఆర్ స్టేట్ మెంట్ తో రాజకీయంగా ఏమవుతుందో చూడాలి మరి.