ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్ లో నేడు కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్రంలోని వివిధ అంశాలపై చర్చించి, ఆమోదించారు. ఇండ్లు, ఇండ్ల స్థలాలకు సంబంధించిన అంశాలు, అర్హులకు ఇండ్ల స్థలాల పట్టాల పంపిణీపై చర్చించారు. సుమారు నాలుగున్నర గంటల పాటు ఈ కేబినెట్ సమావేశం జరిగింది. కేబినెట్ భేటీలో చర్చించి, నిర్ణయం తీసుకున్న విషయాలను మంత్రి హరీశ్ రావు మీడియాకు వెల్లడించారు.

అతి త్వరలోనే తెలంగాణలో రెండో విడత దళిత బంధు ప్రక్రియను చేపడుతున్నట్లు మంత్రి హరీశ్ ప్రకటించారు. దళితబంధులో ఒక లక్షా 30 వేల కుటుంబాలకు రెండో విడత కింద ఆర్థిక సాయం అందించాలని కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి వెంటనే అమలు ప్రక్రియ ప్రారంభించాలని సంబంధిత అధికారులకు సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. దీనికి సంబంధించి వెంటనే అమలు ప్రక్రియ ప్రారంభించాలని సంబంధిత అధికారులకు సీఎం కేసీఆర్‌ ఆదేశించారని వెల్లడించారు. దళితబంధుపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోందని, దళితవర్గాలు దేశవ్యాప్తంగా సీఎం కేసీఆర్‌ వైపు చూస్తున్న పరిస్థితి అని అన్నారు. అలాగే అనేక వివిధ రాష్ట్రాల నుంచి అనేక మంది వచ్చి దళితబంధుపై స్టడీ చేసి వెళ్తున్నారని గుర్తు చేశారు.

 

ఏప్రిల్ 14న దేశంలోనే అతిపెద్దదైన 125 అడుగుల అంబేద్కర్‌ విగ్రహాన్ని ఆవిష్కరించాలని తెలంగాణ కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది. ఐ మ్యాక్స్‌ థియేటర్‌ పక్కన ఏర్పాటు చేస్తున్న అంబేద్కర్‌ విగ్రహ నిర్మాణం ఇప్పటికే పూర్తయిందని మంత్రి హరీశ్‌ రావు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా దళిత బిడ్డలను హైదరాబాద్‌కు పిలిపించి.. లక్షలాది మంది మధ్య అంబేడ్కర్‌ ఆవిష్కరణ కార్యక్రమాన్ని పండుగలా నిర్వహిస్తామని హరీశ్‌ రావు తెలిపారు.

 

దళితబంధు, డబుల్ బెడ్రూం ఇండ్ల పథకం, పోడు భూముల పట్టాల పంపిణీ, జీవో 58,59, దేశంలోనే అతిపెద్ద అంబేడ్కర్‌ విగ్రహ ఆవిష్కరణ, కాశీ, శబరిమలలో రూ. 25 కోట్ల చొప్పున నిధులతో వసతి గృహాల ఏర్పాటు తదితర అంశాలపై కేబినెట్‌ లోతైన చర్చ జరిపి, నిర్ణయాలు తీసుకోవడం జరిగింది.

 

గృహలక్ష్మి పథకం కింద 4 లక్షల మందికి ఇళ్లను మంజూరు చేయాలని నిర్ణయించామని మంత్రి హరీశ్ ప్రకటించారు. గృహలక్ష్మి పథకం కింద ప్రతి నియోజకవర్గానికి 3వేల ఇళ్ల చొప్పున మంజూరు చేస్తామని, లబ్ధిదారుడు తనకు నచ్చిన విధంగా కట్టుకునే విధంగా నిబంధనలు సులభతరం చేస్తామన్నారు. లబ్ధిదారుల ఎంపిక వెంటనే చేపట్టాలని నిర్ణయం తీసుకున్నామని, 4 లక్షల ఎకరాల పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు.

 

ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఆగస్టు నెలాఖరు వరకూ గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారని చెప్పారు. ఇదంతా జిల్లా కలెక్టర్ల నేతృత్వంలో జరగాలని, పారదర్శకంగా, వేగంగా జరగాలని నిర్ణయించామన్నారు. గొర్రెల పంపిణీకి 4 వేల 430 కోట్లు కేటాయించామన్నారు.