తాను కవితా బినామీనని, ఆమె ప్రతినిధినని రామచంద్ర పిళ్లై ఎన్నోసార్లు పేర్కొన్నారని ఈడీ తన రిమాండ్ రిపోర్టులో పేర్కొంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఆదేశాల మేరకే తానే పనిచేశానని, ఆమె సూచనల మేరకే పనిచేశానని చెప్పారని ఈడీ తెలిపింది. లిక్కర్ స్కామ్ లో పిళ్లై కీలకపాత్ర పోషించారని, ఇండో స్పిరిట్ స్థాపనలో ఆయనదే కీలక పాత్ర అని ఈడీ పేర్కొంది.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ రోజుకో మలుపు తిరుగుతోంది. అరెస్టుల పర్వమూ కొనసాగుతుండటంతో మరింత ఉఠ్కంతగా ఈ అంశం మారిపోయింది. తాజాగా… బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (MLC kavitha)ప్రతినిధి అరుణ్ రామచంద్ర పిళ్లైని ఈడీ అరెస్ట్ చేసింది. రెండు రోజులుగా ఇదే అంశం విచారించిన తర్వాతే… అరెస్ట్ చేస్తున్నామని ఈడీ ప్రకటించింది. అరెస్ట్ చేసిన తర్వాత పిళ్లైని పోలీసులు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో హాజరు పరిచారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో మరిన్ని వివరాలు రాబట్టాల్సి వుందని, అందుకే పిళ్లైని తమ కస్టడీకి అప్పజెప్పాలని ఈడీ న్యాయస్థానాన్ని కోరింది.
ఇందుకు న్యాయస్థానం అంగీకరించింది. దీంతో రామచంద్ర పిళ్లైని 7 రోజుల కస్టడీకి కోర్టు అనుమతించింది. దీంతో ఆయన మార్చి 13వ తేదీ వరకు ఈడీ కస్టడీలో ఉండనున్నారు. కస్టడీలో ఉన్న సమయంలో తన తల్లితో ఫోన్ లో మాట్లాడేందుకు, అదే విధంగా ప్రతి రోజూ తన భార్య, బావమరిదిని కలుసుకునేందుకు కూడా కోర్టు ఓకే చెప్పింది. అనారోగ్యంతో బాధపడుతున్న పిళ్లైకు.. హైపో థెరాయిడ్ మందులు, వెన్ను నొప్పికి బెల్ట్ ను కస్టడీలోనూ ఉపయోగించుకోవచ్చని స్పష్టం చేసింది కోర్టు.







