ఢిల్లీ మద్యం కేసులో హైదరాబాద్ కి చెందిన అరుణ్ రామచంద్ర పిళ్లైని ఈడీ అదుపులోకి తీసుకుంది. రాత్రి 11 గంటలకు ఈడీ అరెస్ట్ చేసింది. అరుణ్ రామచంద్ర పిళ్లైని తాము 2 రోజుల పాటు విచారించామని,ఆ తర్వాతే అరెస్ట్ చేశామని ఈడీ పేర్కొంది. న్యూఢిల్లీలోని రౌస్ అవెన్యూ స్పెషల్ కోర్ట్ లో ప్రొడ్యూస్ చేయనున్నారు. ఈ కేసులో మనీ ల్యాండరింగ్ జరిగిందనే ఆధారాలతో జనవరి 25న అరుణ్ పిళ్లై ఆస్తుల ఈడీ అటాచ్ చేసింది. రంగారెడ్డి జిల్లా వట్టినాగులపల్లిలోని రూ.2.25 కోట్లు విలువ చేసే ల్యాండ్‌ను జప్తు చేసింది.సౌత్‌గ్రూప్‌లో ఇండో స్పిరిట్‌ ఎండీ సమీర్‌‌మహేంద్రు, ఎమ్మెల్సీ కవిత కీలకంగా వ్యవహరించారు. కవిత తరుపున అరుణ్ పిళ్లై మీటింగ్స్ లో పాల్గొన్నారని ఈడీ తన ఛార్జిషీట్ లో కూడా పేర్కొంది.

 

ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్.. హైదరాబాద్‌కు చెందిన వ్యాపారవేత్త అరుణ్ రామచంద్ర పిళ్ళైను ఢిల్లీ మద్యంకుంభకోణంలో నిందితుడిగా పేర్కొంది. పలు దఫాలుగా రామచంద్ర పిళ్లై ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహించిన మీదట దర్యాప్తు సంస్థలు కీలక సమాచారాన్ని సేకరించినట్టు తెలుస్తోంది. ఈ కేసులో దాఖలు చేసిన చార్జిషీట్లలో అరుణ్ రామచంద్ర పిళ్లై పేరు కూడా ఉంది.

 

దిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో  అరెస్ట్ అయిన ఆడిటర్ గోరంట్ల బుచ్చిబాబుకు బెయిల్ మంజూరైందు.  బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మాజీ ఆడిటర్‌ గోరంట్ల బుచ్చిబాబుకు దిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీచేసింది. దర్యాప్తు అధికారులకు పాస్‌పోర్టు అప్పగించాలని, రూ.2 లక్షల పూచీకత్తు ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. దిల్లీ లిక్కర్‌ స్కామ్‌ వ్యవహారంలో ఫిబ్రవరి 8న సీబీఐ.. ఆడిటర్ బుచ్చిబాబును అరెస్టు చేసిన విషయం తెలిసిందే.