ఎయిర్ ఇండియా విమానంలో ఇటీవల ఓ వ్యక్తి తోటి ప్రయాణికురాలిపై మూత్ర విసర్జన చేసిన ఘటనను మరువకముందే అలాంటిదే మరో ఘటన చోటుచేసుకుంది. శుక్రవారం రాత్రి 9.16 గంటలకు న్యూయార్క్ నుంచి ఢిల్లీకి బయలుదేరిన అమెరికన్ ఎయిర్‌లైన్స్ విమానంలో ఓ విద్యార్థి తోటి ప్రయాణికుడిపై మూత్ర విసర్జన చేశాడు. తాగిన మత్తుతో నిద్రలోకి జారుకున్న ఓ విద్యార్థి నిద్రలోనే మూత్ర విసర్జన చేశాడు. తన సీట్లోంచి కొంత మూత్రం లీకై పక్కనున్న ప్రయాణికుడి సీట్లో పడింది. మూత్రం పోసిన విద్యార్థి అమెరికాలోని ఓ యూనివర్సిటీలో చదువుకుంటున్నట్లు చెప్పాడు. తోటి ప్రయాణికుడికి అతడు క్షమాపణలు చెప్పాడు. ఫిర్యాదు చేస్తే విద్యార్థి కెరీర్ పాడవుతుందన్న ఉద్దేశంతో బాధితుడు ఎవరికీ ఫిర్యాదు చేయలేదు.
విమాన సిబ్బంది మాత్రం ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకున్నారు. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌కు కంప్లెయింట్ చేశారు. దాంతో విమానం శనివారం రాత్రి 10.12 గంటలకు ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకోగానే సీఐఎస్ఎఫ్ సిబ్బంది మూత్ర విసర్జన చేసిన విద్యార్థిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు పలువురి స్టేట్మెంట్స్ తీసుకున్నట్లు ఎయిర్‌పోర్టు వర్గాలు వెల్లడించాయి. పౌర విమానయాన నిబంధనల ప్రకారం.. తోటి ప్రయాణికులను ఇబ్బందులకు గురిచేసినట్టు రుజువైతే నిందితుడిపై క్రిమినల్ కేసు పెట్టే అవకాశం ఉంటుంది. కొంత కాలంపాటు ప్రయాణాలు చేయకుండా వారిపై నిషేధం విధించవచ్చు.