తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ, గన్నవరం ఇంచార్జ్ బచ్చుల అర్జునుడు అనారోగ్యంతో కన్నుమూశారు. గుండెపోటు రావడంతో ఆయన జనవరి 28న విజయవాడలోని ఆస్పత్రిలో చేరారు. ఆ రోజు నుంచి వెంటిలేటర్‌పైనే బచ్చుల చికిత్స పొందుతున్నారు. ఆయనకు స్టంట్ వేసినా ఆరోగ్య పరిస్థితి మెరుగుపడలేదు. చివరికి అవయవాలన్నీ పనిచేయకపోవడంతో గురువారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. బచ్చుల అర్జునుడు మృతికి టీడీపీ నేతలు సంతాపం ప్రకటించారు.
బచ్చుల అర్జునుడు స్వస్థలం మచిలీపట్నం. టీడీపీ ద్వారానే రాజకీయ అరంగేట్రం చేశారు. 1995 నుంచి 2000 వరకూ పీఏసీఎస్ అధ్యక్షుడిగా పనిచేశారు. ఆ తర్వాత 2000 నుంచి 2005 వరకూ మచిలీపట్నం మున్సిపల్ చైర్మన్ గా పనిచేశారు. 2014 లో జిల్లా పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు. 2017 లో ఎమ్మెల్సీ కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. గతేడాది చివర్లో టీడీపీ నాయకత్వం బచ్చుల అర్జునుడును గన్నవరం ఇంఛార్జ్‌గా నియమించింది. వల్లభనేని వంశీని ఓడించేందుకు బచ్చుల అర్జునుడును రంగంలోకి దింపారు.












