ఇందిరా గాంధీ ఎంత నిరంకుశంగా వ్యవహరించారో.. మోదీ కూడా అంతే : కేజ్రీవాల్

కేంద్రంలోని మోదీ ప్రభుత్వంపై ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ తీవ్రంగా మండిపడ్డారు. ఢిల్లీ డెవలప్ కావడం మోదీ ప్రభుత్వానికి ఏమాత్రం ఇష్టం లేదని విరుచుకుపడ్డారు. అందుకే తప్పుడు విధానాలకు దిగుతోందన్నారు. ఆరోగ్యం, విద్యారంగంలో తాము చేస్తున్న మంచి పనులను దెబ్బతీసేందుకు మోదీ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. తమ కేబినెట్ పదవులకు సిసోడియా, సత్యేంద్ర జైన్ రాజీనామా చేసిన నేపథ్యంలో కేజ్రీవాల్ పై వ్యాఖ్యలు చేశారు. సిసోడియా రాష్ట్ర డెవలప్ మెంట్ కోసం పనిచేశారని కితాబునిచ్చారు.

 

మద్యం పాలసీలో ఎలాంటి అవినీతి జరగలేదని, అదంతా ఓ కట్టుకథ అని అన్నారు. “ఒకవేళ మనీశ్ సిసోడియా ఇవాళ బీజేపీలో చేరితే రేపు ఆయన జైలు నుంచి విడుదల అవుతారు కదా? అన్ని కేసులనూ తొలగిస్తారు. అవినీతి జరగడం అనేది వాళ్లకి సమస్య కాదు. అభివృద్ధి పనులను ఆపడం, ప్రతిపక్షాల మీదకు సీబీఐ-ఈడీని పంపడమే వారికి ముఖ్యం” అంటూ కేజ్రీవాల్ ఎద్దేవా చేశారు. దేశానికి మెడల్స్ తెలిచ్చిన ఇద్దరినీ ప్రధాని మోదీ జైలుకు పంపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మద్యం విధానం అన్నది కేవలం ఒక సాకు మాత్రమేనన్నారు.

 

ఇంటింటికీ వెళ్లి ప్రధాని మోదీ తీరు గురించి ప్రతి ఒక్కరికీ వివరించే కార్యక్రమాన్ని చేపడతామని కేజ్రీవాల్ చెప్పారు. అప్పట్లో ఓ సారి మాజీ ప్రధాని ఇందిరా గాంధీ ఎలా తీవ్ర నిరంకుశత్వంగా వ్యవహరించారో, అలాగే ఇప్పుడు మోదీ కూడా అదే దారిలో వెళ్లేందుకు సిద్ధమవుతున్నారని చెబుతామని అన్నారు. ప్రజలే మంచి సమాధానం ఇస్తారని కేజ్రీవాల్ పేర్కొన్నారు.

 

మరోవైపు.. మనీష్ సిసోడియా, మనీలాండరింగ్ కేసులో జైలులో ఉన్న మంత్రి సత్యేంద్ర జైన్‌లు వారి పదవులకు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. వారి రాజీనామాలను ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా ఆమోదించారు. అయితే ఈ క్రమంలోనే ఆప్ ఎమ్మెల్యేలు అతిషి, సౌరభ్ భరద్వాజ్‌లను మంత్రివర్గంలోకి తీసుకోవాలని ‌కేజ్రీవాల్ నిర్ణయం తీసుకున్నారు. కేబినెట్‌లో నియమాకానికి సంబంధించి అతిషి, సౌరభ్ భరద్వాజ్‌ పేర్లను కేజ్రీవాల్.. లెఫ్టినెంట్ గవర్నర్‌ వీకే సక్సెనాకు పంపారని సంబంధిత వర్గాలు  తెలిపాయి.

Related Posts

Latest News Updates