సీనియర్ వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకున్న ఎంజీఎం (MGM) పీజీ వైద్యవిద్యార్థిని ప్రీతి (PG Medical student Preeti) మృతదేహం (Dead body) స్వగ్రామానికి చేరుకున్నది. గత ఐదు రోజులుగా హైదరాబాద్‌లోని నిమ్స్ (NIMS) దవాఖానలో చికిత్స పొందుతున్న ప్రీతి.. ఆదివారం రాత్రి 9.10 గంటలకు మృతిచెందింది. అనంతరం ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ దవాఖానకు (Gandhi Hospital) తరలించారు. తెల్లవారుజామున 4 గంటల సమయంలో పోస్టుమార్టం పూర్తవడంతో వైద్యులు ఆమె భౌతికకాయాన్ని తల్లిదండ్రులకు అప్పగించారు. ఈ సందర్భంగా తల్లిదండ్రులు, బంధువులు, కుటుంబీకులు కన్నీరు మున్నీరవుతున్నారు. దీంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. ఇక ప్రీతి మృతితో తండా పరిసర ప్రాంతాలన్నీ పోలీసుల సెక్యూరిటీతో నిండిపోయాయి. ఆందోళనల నేపథ్యంలో ప్రత్యేక పోలీస్ బలగాలు మోహరించి, భద్రతను కట్టుదిట్టం చేశారు.
మరో వైపు నిమ్స్ వద్ద అర్ధరాత్రి వరకూ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. కాకతీయ మెడికల్ కళాశాల HOD ని సస్పెండ్ చేయాలని, సిట్టింగ్ జడ్జితో విచారణ చేపట్టాలని ప్రీతి కుటుంబీకులు డిమాండ్ చేశారు. అసలు తన కుమార్తె ఎలా చనిపోయిందో తెలిపే సమగ్ర నివేదిక కావాలని తండ్రి నరేంద్ డిమాండ్ చేశారు. మరణానికి కారణాలు చెప్పాలని, లేదంటే ఇక్కడే ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించారు. అంతేకాకుండా ప్రీతి డెడ్ బాడీని అంబులెన్స్ లో తరలించేందుకు పోలీసులు ప్రయత్నించగా… కుటుంబీకులు, గిరిజన, విద్యార్థి సంఘాలు అడ్డగించాయి. ఈ సందర్భంగా తోపులాట కూడా జరిగింది. చివరికి అర్ధరాత్రి కల్లా శవపంచనామా పూర్తి చేసి, ఉదయాని కల్లా స్వస్థలానికి పంపేందుకు ఏర్పాట్లు చేశారు.
మరో వైపు ప్రీతి మరణంపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ఘటనపై విచారణ కొనసాగుతోందని, నిందితుడ్ని పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారని పేర్కొన్నారు. ప్రీతి మరణంపై మంత్రులు హరీశ్, కేటీఆర్, సత్యవతి రాథోడ్, శ్రీనివాస్ గౌడ్, తలసాని, జగదీశ్ రెడ్డి తదితరులు సంతాపం ప్రకటించారు.
ప్రీతి కుటుంబానికి ఎక్స్ గ్రేషియా ప్రకటించిన ప్రభుత్వం
ఇక… బాధిత ప్రీతి కుటుంబానికి 10 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం. అంతేకాకుండా కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కూడా ప్రకటించింది. మంత్రి ఎర్రబెల్లి 20 లక్షల ఆర్దిక సహాయాన్ని ప్రకటించారు. ఇక… ప్రీతి తల్లిదండ్రులతో రాష్ట్ర ప్రభుత్వం చర్చలు జరిపింది. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది. ఫాస్ట్ ట్రాక్ కోర్టులో ఈ కేసును విచారణ చేపడతామని ప్రకటించింది.