రాష్ట్రంలో ప్రజాస్వామ్య పాలన లేదని అందుకే రాష్ట్రపతి పాలన విధించాలని వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. రాష్ట్రంలో నియంత పాలన కొనసాగుతోందని, కేసీఆర్ రాజ్యాంగం అమలవుతోందని విమర్శించారు. వైఎస్ షర్మిల శనివారం గవర్నర్ తమిళిసైతో భేటీ అయ్యారు. తెలంగాలో రాష్ట్రపతి పాలన విధించాలని తాను గవర్నర్ ను కోరినట్లు ఆమె వెల్లడించారు. రాష్ట్రంలో నిష్పక్షపాతంగా ఎన్నికలు జరుగుతాయన్న నమ్మకం తమకు లేదని, అందుకే ఈ డిమాండ్ చేసినట్లు తెలిపారు. చిన్నారులపై వీధి కుక్కలు దాడి చేసినా, ప్రభుత్వం పట్టించుకునే స్థితిలో లేదని, అధికార పక్ష నేతలు ప్రతిపక్షాలపై దాడులు చేస్తున్నారని మండిపడ్డారు.

 

రాష్ట్రంలో ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటారు కానీ… వారు కేవలం బీఆర్ఎస్ పార్టీకి మాత్రమే ఫ్రెండ్లీగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో ప్రభుత్వ యంత్రాంగాలను కేసీఆర్ గుప్పిట్లో పెట్టుకున్నారు. ప్రజల పక్షాన నేను నిలబడితే ఇష్టం వచ్చినట్లు నన్ను తిట్టారు. కేసీఆర్‌కు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా ఇబ్బందులు పెడుతున్నారని షర్మిల ఆరోపించారు. ప్రభుత్వ పెద్దలంతా తాలిబాన్లలా వ్యవహరిస్తున్నరని షర్మిల విమర్శించారు. ఎన్నికల సంవత్సరం కావడంతో ఇచ్చిన హామీలు నెరవేర్చలేక ప్రభుత్వం ప్రతిపక్షాలపై దాడులు చేస్తోందని అన్నారు.