మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డిని సీబీఐ ప్రశ్నించింది. దాదాపు 5 గంటల పాటు ఈ విచారణ సాగింది. అయితే.. విచారణ ముగిసిన తర్వాత అవినాష్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. వ్యక్తిని టార్గెట్ గా చేసుకొనే, విచారణ అంతా సాగుతోందని మండిపడ్డారు. సీబీఐ దర్యాప్తు పారదర్శకంగా సాగాలని డిమాండ్ చేశారు. సీబీఐ విచారణ సరైన దిశలతో వెళ్లాలని చెబుతున్నానే తప్ప.. అనుమానించడం లేదన్నారు. సీబీఐ అధికారులు అడిగిన ప్రశ్నలకు తనకు తెలిసిన సమాచారం అంతా చెప్పానని అన్నారు.
మీడియా బాధ్యతగా వార్తలు ప్రసారం చేయాలని కోరారు. తాను వైఎస్ విజయమ్మ దగ్గరికి వెళ్లి వస్తే.. బెదిరించి వచ్చానని చర్చలు పెట్టారని, ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అది ఎంత వరకు సబుబని ప్రశ్నించారు. తాను దుబాయ్ కి వెళ్లిపోయానని వక్రీకరించే వార్తలు వేస్తున్నారన్నారు. ఏదో గూగుల్ టేక్ అవుట్ అంటున్నారని, అది గూగుల్ టేక్ అవుటా? టీడీపీ టేక్ అవుటా? అనేది కాలమే నిర్ణయిస్తుందన్నారు. వివేకా చనిపోయిన రోజు తాను మార్చురీ దగ్గర విలేకర్లతో మాట్లాడానని, రెండు రోజుల తర్వా మరోసారి మాట్లాడానని గుర్తు చేశారు. అప్పుడు మాట్లాడిందే ఇప్పుడూ చెబుతున్నానని, సీబీఐ అిగినా, ఇంకెవరు అడిగినా ఇదే చెబుతానని అవినాష్ రెడ్డి అన్నారు.
నేడు వైఎస్ భాస్కర్ రెడ్డిని విచారించనున్న సీబీఐ
వైఎస్ వివేకా హత్య కేసువిచారణలో సీబీఐ శరవేగంగా దూసుకుపోతోంది. కడప పార్లమెంటు సభ్యుడు అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డి ని సీబీఐ అధికారులు శనివారం కడపలో విచారించనున్నారు. ఈరోజు ఉదయం 10 గంటలకు కడప సెంట్రల్ జైలు కేంద్రంగా జరిగే విచారణకు హాజరుకావాలని నిన్న భాస్కర్ రెడ్డికి మరోసారి అధికారులు నోటీసులు పంపారు. ఈ మేరకు ఆయన సెల్ వాట్సప్‌కు నోటీసు పంపారు.













