ఢిల్లీ మేయర్ ఎన్నికల్లో ఆప్ విజయం సాధించింది. ఈ విజయంపై ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఘాటుగా స్పందించారు. హర్షం కూడా వ్యక్తం చేశారు. గూండాలు ఓడిపోయాయారు, ప్రజలు గెలిచారు అని కేజ్రీవాల్ చెప్పారు. మేయర్ ఎన్నికల్లో విజయం సాధించిన ఒబెరాయ్.. సీఎం కేజ్రీవాల్, డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, లెఫ్టినెంట్ గవర్నర్ కు ధన్యవాదాలు తెలిపారు. మున్సిపల్ చట్టం ప్రకారం నియమాలు, నిబంధనలు పాటిస్తానని హామీ ఇచ్చారు. ఢిల్లీ ప్రజల కలలను నెరవేర్చేందుకు అందరం కలిసి పని చేద్దామని పిలుపునిచ్చారు.
హోరాహోరీగా సాగిన ఢిల్లీ మేయర్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ ఘన విజయం సాధించింది. బీజేపీ అభ్యర్థి రేఖా గుప్తాపై 34 ఓట్ల తేడాతో ఆప్ మేయర్ అభ్యర్థి షెల్లీ ఒబెరాయ్ గెలుపొందారు. మొత్తం 266 ఓట్లు పోల్ కాగా… ఆప్ అభ్యర్థి షెల్లీకి 150 ఓట్లు రాగా, రేఖా గుప్తాకి 116 ఓట్లు వచ్చాయి. మేయర్ ఎన్నికల్లో గెలుపొందడంతో ఆప్ కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. బుధవారం మధ్యాహ్నం 11.30 గంటలకు ఎంసీడీ సమావేశమైంది. మేయర్, డిప్యూటీ మేయర్, ఆరుగురు స్టాండింగ్ కమిటీ సభ్యులకు ఎన్నిక జరగాల్సి ఉండగా, సభా కార్యక్రమాలకు మూడు సార్లు అవాంతరాలు తలెత్తాయి. అనంతరం కీలకమైన మేయర్ పదవికి ఓటింగ్ జరిగింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎంసీడీ ఎన్నికల పోలింగ్ బుధవారం జరిగింది.
షెల్లీ ఒబెరాయ్ ఢిల్లీ యూనివర్సిటీ (DU)లో విజిటింగ్ ప్రొఫెసర్‌గా ఉన్నారు. ఆమె ఇండియన్ కామర్స్ అసోసియేషన్ (ICA) జీవితకాల సభ్యురాలు కూడా. ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్శిటీ (ఇగ్నో) స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్ నుండి ఒబెరాయ్ పీహెచ్డీ చేశారు. ఐసీఏ కాన్ఫరెన్స్ నుంచి గోల్డ్ మెడల్‌ను అందుకున్నారు. పలు దేశీయ,అంతర్జాతీయ సదస్సుల నుంచి ప్రశంసలు సైతం దక్కించుకున్నారు.












