రాజకీయాలు భారత్ లో పుట్టడం లేదు… సరిహద్దులు దాటే పుడుతున్నాయి : BBC డాక్యుమెంటరీపై జైశంకర్ వ్యాఖ్యలు

ప్రధాని నరేంద్ర మోదీపై బీబీసీ తీసిన డాక్యుమెంటరీపై విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. బీబీసీ డాక్యుమెంటరీ యాదృచ్ఛికమేమీ కాదని, దీని వెనుక రాజకీయ కుట్ర వుందని స్పష్టం చేశారు. కొందరికి ఏమాత్రం ధైర్యం లేదని, రాజకీయ క్షేత్రంలోకి వచ్చేందుకు జంకుతూ… మీడియా ముసుగులో ఇలాంటి రాజకీయాలు చేస్తున్నారని దెప్పిపొడిచారు. 1984 లో ఢిల్లీ వేదికగా అనేక సంఘటనలు జరిగాయని, డాక్యుమెంటరీ తీయాలనుకుంటే… దానిపై తీయవచ్చని, మరి వాటిపై ఎందుకు డాక్యుమెంటరీ రాలేదని సూటిగా ప్రశ్నించారు.

 

రాజకీయాలు భారత్ లో పుట్టడం లేదని, సరిహద్దులు దాటి రాజకీయాలు పుడుతున్నాయని ఘాటుగా వ్యాఖ్యానించారు. ఇండియాలో, ఢిల్లీలో ఇంకా ఎన్నికల సీజన్ ప్రారంభం కాలేదని, లండన్, న్యూయార్క్ లో మాత్రం ఇప్పటికే ఇది ప్రారంభమైపోయిందని ఎద్దేవా చేశారు. మోదీకి వ్యతిరేకంగా, భారత్ కి వ్యతిరేకంగా కొన్ని దశాబ్దాలుగా కుట్రలు జరుగుతున్నాయని, బీబీసీ డాక్యుమెంటరీ ఇందులో భాగమేనని జైశంకర్ పేర్కొన్నారు. సరిగ్గా ఎన్నికల ముందే ఇలాంటి డాక్యుమెంటరీ విడుదల వెనుక ఆంతర్యమేమిటని ప్రశ్నించారు.

 

కాగా..గుజరాత్‌లో 2002లో జరిగిన అల్లర్లు, ఆ సమయంలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్ర మోదీ తీరుపై బ్రిటన్‌కు చెందిన మీడియా సంస్థ బీబీసీ తీసిన రెండు పార్టుల డాక్యుమెంటరీ సిరీస్‌ (ఇండియా: ది మోడీ కొశ్చన్) దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ డాక్యుసిరీస్ దుష్ప్రచారం చేసేదిగా ఉన్నదని కేంద్ర ప్రభుత్వం కొట్టివేసింది. బీబీసీ డాక్యుమెంటరీ లింక్‌లను బ్లాక్ చేయాలని యూట్యూబ్, ట్విట్టర్‌లకు కేంద్ర ప్రభుత్వం ఎమర్జెన్సీ పవర్స్ ఉపయోగించి ఆదేశాలు జారీ చేసింది. వివాదాస్పద డాక్యుమెంటరీని సోషల్ మీడియా, ఆన్‌లైన్ ఛానెల్‌లలో నిషేధించబడింది.

 

మరో వైపు ఢిల్లీ, ముంబైకి సంబంధించిన బీబీసీ కార్యాలయాల్లో ఐటీ సోదాలు చేపట్టింది. మూడు రోజుల పాటు ఈ సోదాలు జరిగాయి. సోదాల్లో భాగంగా అధికారులు బీబీసీ ఆర్థిక కార్యకలాపాలకు సంబంధించిన డాటా కాపీలు తీసుకొన్నారు. సంస్థ ఆర్థిక లావాదేవీలు, ఇతర వివరాలపై ఉద్యోగులను ప్రశ్నించారు. సీనియర్‌ ఉద్యోగుల స్టేట్‌మెంట్‌ను రికార్డు చేయడంతో పాటు పలు పత్రాలను స్వాధీనం చేసుకొన్నారు. అయితే సోదాల గురించి ఐటీ శాఖ నుంచి అధికారిక ప్రకటన రాలేదు. సోదాల్లో భాగంగా పలువురు ఉద్యోగులను మూడు రోజులుగా అధికారులు ఇంటికి పంపలేదని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.

Related Posts

Latest News Updates