కర్ణాటక రాష్ట్ర దేవదాయశాఖ కమిషనర్ ఐఏఎస్ రోహిణి సింధూరి, రాష్ట్ర చేతివృత్తుల కార్పొరేషన్ ఎండీ ఐపీఎస్ రూపా మౌద్గల్ పరస్పర ఆరోపణల వ్యవహారంలో కర్నాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇద్దరికీ ఎలాంటి పోస్టింగులు ఇవ్వకుండానే ఇద్దరినీ బదిలీ చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. తక్షణమే ఈ బదిలీలు అమలులోకి వస్తాయని ప్రభుత్వం తేల్చి చెప్పింది. ప్రస్తుతం రూపా మౌద్గల్ రాష్ట్ర హస్త కళల అభివృద్ధి కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఇక సింధూరి ధర్మాదాయ శాఖ కమిషనర్ గా విధులు నిర్వర్తిస్తున్నారు. రోహిణి సింధూరి స్థానంలో ఐఏఎస్ బసవరాజేంద్రను నియమించారు. మరో వైపు రూప మౌద్గల్ స్థానంలో ఐఏఎస్ భారతిని నియమించారు.
కొన్ని రోజులుగా వీరిద్దరూ బహిరంగంగా సోషల్ మీడియా వేదికగా విమర్శలు చేసుకుంటున్నారు. ఇటీవల ఐపీఎస్ రూప, ఐఏఎస్ రోహిణిపై అవినీతి ఆరోపణలు చేస్తూ.. ఫేస్ బుక్ లో ఆమెకు సంబంధించిన ఫొటోలను షేర్ చేశారు. అనంతరం స్పందించిన రోహిణి.. రూప మతిస్థిమితం కోల్పోయారని, ఆమె మానసిక రోగానికి చికిత్స తీసుకోవాలంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. దీంతో వీరిద్దరి మధ్య ఉన్న వివాదం కాస్తా రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది. ఈ నేపథ్యంలో కర్ణాటక రాష్ట్ర హోంమంత్రి ఆరగ జ్ఞానేంద్ర ఆ ఇద్దరు మహిళా అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.












