హైదరాబాద్ నగరంలోని అంబర్ పేటలో వీధి కుక్కల దాడిలో నాలుగు సంవత్సరాల బాలుడు మరణించాడు. ఈ ఘటన ఛే నెంబర్ దగ్గర జరిగింది. కుక్కలన్నీ ఆ చిన్నారిపై దాడి చేయడంతో ఆ బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. దీనికి సంబంధించిన విజువల్స్ అక్కడ సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. అయితే దీనిపై రాష్ట్ర మున్సిపల్ శాఖా మంత్రి కేటీఆర్ స్పందించారు. వీధి కుక్కల దాడిలో బాలుడు మరణించడం దురదృష్టకరమని అన్నారు. బాధిత కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు.
ఈ ఘటన తనను ఎంతో కలిచివేసిందన్నారు. వీధి కుక్కల నియంత్రణకు అన్ని చర్యలూ తీసుకుంటున్నామని, ఇకపై ఇలాంటి ఘటనలు జరగకుండా చూసుకుంటామని హామీ ఇచ్చారు. తాము జంతు సంరక్షణ కేంద్రాలు, జంతు జనన నియంత్రణ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. ఆ బిడ్డను తిరిగి తీసుకురాలేనని తనకు తెలుసని, మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా మాత్రం చూస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారు.
నగరంలోని అంబర్పేటలో వీధి కుక్కల దాడిలో మృతి చెందిన బాలుడి ఉదంతంపై రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బాలుడు ప్రదీప్ కుటుంబానికి సంతాపం తెలిపారు. నగరంలో వీధి కుక్కలు, కోతుల సమస్యను పరిష్కరించేందుకు ఈనెల 23న ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ సమావేశంలో వీధి కుక్కలు,కోతుల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై జీహెచ్ఎంసీ, వెటర్నరీ అధికారులతో చర్చిస్తామని వెల్లడించారు. వీధి కుక్కలు, కోతుల వల్ల మహిళలు, చిన్నారులు అధికంగా ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
అంబర్పేటనియోజకవర్గంలో నాలుగు సంవత్సరాల బాలుడు కుక్కకాటులో మరణించడంపై జీహెచ్ఎంసీ నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై వెంటనే ఎంక్వయిరీ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ ఘటనపై చర్చించేందుకు ఈరోజు మధ్యాహ్నం జీహెచ్ఎంసీ అధికారులతో ఆమె అత్యవసర సమావేశాన్ని నిర్వహించనున్నారు.