మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డికి సీబీఐ మరోసారి నోటీసులు జారీ చేసింది. గత నెల 28వ తేదీన అవినాష్‌ను హైదరాబాద్‌లోని సీబీఐ కార్యాలయంలో మొదటి సారిగా సీబిఐ అధికారులు ప్రశ్నించిన విషయం తెలిసిందే. తాజాగా మరోసారి ఈనెల 24వ తేదీ మధ్యాహ్నం 3గంటలకు హైదరాబాద్‌లోని కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని సీబీఐ అధికారులు వాట్సప్ ద్వారా అవినాష్‌రెడ్డికి నోటీ సులు జారీ చేశారు.
వివేకా హత్య కేసు కడప నుంచి హైదరాబాద్‌కు బదిలీ అయ్యాక సీబీఐ దర్యాప్తు వేగం పెంచింది. సుప్రీం కోర్టు ఆదేశాలతో ఓ వైపు సీబీఐ హైదరాబాద్ కేంద్రంగా దర్యాప్తు ముమ్మరం చేస్తే, మరోవైపు సీబిఐ కోర్టులో విచారణ కూడా వేగమందుకుంది. దీనిలో భాగంగానే మొదటి సారి ఎంపీ అవినాష్‌ను ప్రశ్నించిన సీబిఐ అతని కాల్‌డేటాను కీలకంగా పరిగణించింది. ఫోన్‌కాల్ జాబితా ఆధారంగానే ముఖ్యమంత్రి వైఎస్ జగ న్ ఓఎస్డీ కృష్ణమోహన్‌రెడ్డి, ఆ ఇంటి మనిషి నవీన్‌లకు నోటీసులిచ్చి కడపలో వారిద్దరినీ విచారించింది. అయితే ఎంపీ అవినాష్ రెడ్డిని మరోసారి విచారించేందుకు తాజాగా రెండోసారి నోటీసులులివ్వడం ప్రస్తుతం మరో సంచలనంగా మారింది. మళ్లీ విచారణకు పిలిచినప్పుడు రావాలని మొదట్లోనే సీబిఐ అధికారులు స్పష్టం చేశారు కూడా. కాగా తనకు నోటీసులు అందిన విషయం వాస్తవమేనని ఎంపీ అవినాష్‌రెడ్డి ధ్రువీకరించారు.