కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ముఖ్యమంత్రి కేసీఆర్ పై చేసిన వ్యాఖ్యలకు బీఆర్ఎస్ నుంచి గట్టి కౌంటర్లు వస్తున్నాయి. మొదటగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత విమర్శించగా… ఆ తర్వాత మంత్రులు కేటీఆర్, హరీశ్ విరుచుకుపడ్డారు. తెలంగాణకు మెడికల్ కాలేజీల మంజూరు విషయంలో కేంద్ర మంత్రులు ఒకరికి మించి ఒకరు అబద్దాలు మాట్లాడారని, పైగా ఒకే అబద్ధాన్ని ముగ్గురూ ఒక్కోలా చెప్పారని కేటీఆర్ మండిపడ్డారు. ‘మోదీజీ.. కనీసం మీ మంత్రులందరికి ఒక అబద్ధాన్ని ఒకేలా చెప్పేలా ట్రెయినింగ్ ఇవ్వండి’ అంటూ వ్యంగ్యంగా కేటీఆర్ ట్వీట్ చేశారు. కేంద్ర మంత్రలు పచ్చి అబద్ధాలు మాట్లాడటం దారుణమని, ముగ్గురు కేంద్రమంత్రులు పరస్పర విరుద్ధ వ్యాఖ్యలు చేశారని విమర్శించారు. తెలంగాణకు 9 మెడికల్ కాలేజీలు మంజూరైనట్టు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి చెబుతున్నారని, మరో మంత్రి మన్సుక్ మాండవీయ మెడికల్ కాలేజీల కోసం తెలంగాణ నుంచి ఒక్క ప్రతిపాదన కూడా రాలేదంటున్నారని, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాత్రం కేవలం రెండు ప్రతిపాదనలే వచ్చాయని మాట్లాడుతున్నారని.. ఇలా ఒకరికొకరు పొంతన లేకుండా అబద్ధపు వ్యాఖ్యలు చేస్తున్నారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తంచేశారు.
మెడికల్ కాలేజీల విషయంలో తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేస్తోందని, ఆ అన్యాయంపై తాము కేంద్రాన్ని ప్రశ్నిస్తున్నామని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఖమ్మం, కరీంనగర్‌కు మెడికల్ కాలేజీలు ఇవ్వమని కేంద్రం చెప్పడంపై ఆయన మండిపడ్డారు. తమకు మెడికల్ కాలేజీలు ఇవ్వమని చెప్పిన బీజేపీకి ఎందుకు ఓటు వేయాలో కరీంనగర్, ఖమ్మం ప్రజలు ఇప్పుడు ఆలోచిస్తారని అన్నారు. నిర్మలా సీతారామన్ తెలంగాణ గురించి పూర్తిగా అబద్ధాలు మాట్లాడి బురదజల్లే ప్రయత్నం చేశారని మంత్రి విమర్శించారు. అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడింది నూటికి నూరుపాళ్లు నిజమని, ఆయన ప్రతి మాట ఆధారాలతో, లెక్కలతో మాట్లాడారని వెల్లడించారు.