తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. నేటితో కేసీఆర్ 69 వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ కి ప్రజా ప్రతినిధులు, ప్రముఖులు, ఇతర రాష్ట్రాల నేతలు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. జన్మదినం సందర్భంగా తెలంగాణ వ్యాప్తంగా సర్వమత ప్రార్థనలు, మొక్కలు నాటే కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అదే విధంగా టీఆర్ఎస్ కాస్త బీఆర్ఎస్ గా మారిన నేపథ్యంలో పక్క రాష్ట్రాల్లో కూడా కేసీఆర్ కటౌట్లు ఏర్పాటు చేస్తున్నారు. పలువురు కార్యకర్తలు సేవా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. సిద్దిపేటలోని జయశంకర్ స్టేడియంలో సీఎం కేసీఆర్ కప్ సీజన్-3 టోర్నమెంట్ అట్టహాసంగా ప్రారంభమైంది. టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు, సినీ నటుడు నానితో కలిసి మంత్రి హరీశ్‌రావు టోర్నమెంట్‌ను ప్రారంభించారు. ఈ వేదికపై హీరో నాని నూతన సినిమా దసరా ట్రైలర్‌ను మంత్రి ప్రారంభించారు.
బీఆర్‌ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు ఆస్ట్రేలియాలో కూడా ఘనంగా నిర్వహించారు. సిడ్నీ, అడిలైడ్, మెల్బోర్న్, కాన్‌బెర్రా, బ్రిస్బేన్, గోల్డ్ కోస్ట్ , బెండీగో, బల్లారాట్ నగరాల్లో బీఆర్‌ఎస్ ఆస్ట్రేలియా శాఖ అధ్యక్షుడు కాసర్ల నాగేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో కేసీఆర్ జన్మదిన వేడుకలు నిర్వహించారు. వినయ్ సన్నీగౌడ్ ఆధ్వర్యంలో మెల్బోర్న్‌లో నిర్వహించిన వేడుకల్లో కాసర్ల నాగేందర్ రెడ్డి పాల్గొని మాట్లాడారు.
సీఎం కేసీఆర్ 1954 ఫిబ్రవరి 17 న సిద్దిపేటలోని చింతమడకలో జన్మించారు. రాఘవరావు- వెంకటమ్మ తల్లిదండ్రులు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రమే సాధనగా టీఆర్ఎస్ ను స్థాపించారు. స్వరాష్ట్రం కోసం ఉద్యమించారు. అన్ని పార్టీలూ తెలంగాణకి అనుకూలంగా నిర్ణయం తీసుకునే విధంగా ఒత్తిడి పెంచడంలో సక్సెస్ అయ్యారు. ఆ తర్వాత డిసెంబర్ 9 న తెలంగాణను ఏర్పాటు చేస్తూ, ప్రక్రియ ప్రారంభిస్తున్నట్లు కాంగ్రెస్ ప్రకటించింది. దీంతో తెలంగాణ అనే కల సాకారమైంది. 2014 లో తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఎన్నికయ్యారు. ఆ తర్వాత టీఆర్ఎస్ ను కాస్త బీఆర్ఎస్ గా మార్చేసి, దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలని డిసైడ్ అయ్యారు.