యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మి నరసింహ స్వామివారిని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌ రావు దర్శించుకున్నారు. గురువారం మధ్యాహ్నం సతీసమేతంగా కొండపైకి చేరుకున్న మంత్రి హరీశ్‌ యాదాద్రీశునికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఆలయ సంప్రదాయ రీతిలో ఘన స్వాగతం పలికారు. దర్శనానంతరం మంత్రి దంపతులకు ఆలయ ప్రధాన అర్చకులు వేద ఆశీర్వచనం చేయగా, అధికారులు స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు.యాదాద్రి ఆలయానికి మంత్రి హరీష్ రావుతో పాటుగా ఎంపీ బడగుల  లింగయ్య యాదవ్ , జెడ్పీ ఛైర్ పర్సన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి, ఆలేరు ఎమ్మెల్యే సునీత మహేందర్ రెడ్డి కూడా స్వామివారిని దర్శించుకున్నారు.

 

దర్శనం అనంతరం యాదగిరి గుట్టలో జరిగిన సభలో మంత్రి హరీశ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… బీజేపీ పాలిస్తున్న ఇతర రాష్ట్రాల్లో ఎక్కడ చూసిన కరెంటు కోతలు ఉన్నాయని హరీష్ రావు ఆరోపించారు. కాని తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం ఒక్క గుంట భూమి కూడా ఎండిపోకుండా నాణ్యమైన కరెంట్ ఇస్తున్నామని చెప్పారు. ఇప్పుడున్న రాజకీయాల్లో కాంగ్రెస్ పేలుస్తా అంటే.. బీజేపీ కూలుస్తా అటుందని ఎద్దేవా చేశారు. కూల్చే నాయకులు కావాలా?.. ప్రజల అవసరాలు తీర్చే కేసీఆర్ లాంటి ముఖ్యమంత్రి కావాలా ఆలోచన చేయాలన్నారు. రాజకీయాల కోసం బీఆర్ఎస్ దేవుడిని వాడుకోదని అన్నారు. అద్భుతమైన యాదాద్రి దేవాలయాన్ని నిర్మించామని గుర్తు చేశారు.