కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కి లేఖ రాశారు. తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో విమానాశ్రయాల ఏర్పాటు ద్వారా ఎయిర్ వేస్ అనుసంధానత కోసం అవసరమైన సహకారం అందించాలని అందులో కోరారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరినా… స్పందించడం లేదన్నారు. కేంద్రం అందిస్తున్న సహకారాన్ని సద్వినియోగం చేసుకుంటూ, సాంకేతిక, భూపరీక్షల ఆమోదాన్ని పొందిన ఆదిలాబాద్, జక్రాన్ పల్లి, వరంగల్ విమానాశ్రయాల నిర్మాణానికి ముందుకు రావాలని కిషన్ రెడ్డి లేఖలో సూచించారు.
సామాన్యులకు సైతం విమాన ప్రయాణం అందుబాటులోకి తేవాలనే ఉద్దేశంతో 2016లో ఉడాన్ స్కీమ్ తీసుకొచ్చామని, 2014లో దేశంలో 74 ఎయిర్ పోర్ట్ లు ఉంటే, ప్రస్తుతం వాటి సంఖ్య 140 దాటిందని పేర్కొన్నారు. 2026 నాటికి ఈ సంఖ్యను 220కి పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, ఇందులో భాగంగా తెలంగాణలో ఆదిలాబాద్, జక్రాన్పల్లి, వరంగల్ ఎయిర్ పోర్ట్ ల ఏర్పాటుకు ఆమోదం తెలిపామని లేఖలో పేర్కొన్నారు. ఈ ఎయిర్ పోర్ట్ ల నిర్మాణం జరిగితే చిన్న, ప్రైవేటు విమానాలు రాకపోకలు సాగించేందుకు వీలుంటుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు.