విద్య, వైద్యం, జీవనోపాధికి సంబంధించి ప్రజల అవసరాలను తీర్చేందుకు తెలంగాణ ప్రభుత్వం విశేష కృషి చేస్తున్నదని, దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా లక్ష మందికి సరిపడా అత్యధిక సంఖ్యలో వైద్యులు, పడకలు ఉన్న రాష్ట్రం తెలంగాణే అని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. వైద్యసేవల్లో దేశంలోనే తెలంగాణ అగ్రస్థానంలో ఉన్నదని అన్నారు. అమెరికాకు చెందిన అమెరికన్ ఇండియా ఫౌండేషన్ (ఏఐఎఫ్) హైదరాబాద్ చాప్టర్ ప్రారంభోత్సవానికి కేటీఆర్ హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… రాష్ట్ర ప్రభుత్వం మొత్తం 33 జిల్లాల్లో ఒకో మెడికల్ కాలేజీ, వైద్యశాలను ఏర్పాటు చేయడం ద్వారా ఆరోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాలను మరింతగా పెంచుతున్నదని వివరించారు. రాష్ట్రంలో విద్య, వైద్యాన్ని మెరుగుపరిచేందుకు ప్రభుత్వపరంగానే కాకుండా చాలా ఎన్జీవోలతో కూడా కలిసి పని చేస్తున్నామని వెల్లడించారు. విద్యా, ప్రజారోగ్యం, జీవనోపాధి అనే మూడు ప్రాథమిక అవసరాలను తీర్చేందుకు తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పనిచేయాలని ఫౌండేషన్ సభ్యులకు పిలుపునిచ్చారు. ప్రజలు, సంసృతి, వ్యవస్థాపక, దాతృత్వ కార్యకలాపాలపరంగా యూఎస్, భారతదేశం మధ్య లోతైన సంబంధాలను గుర్తుచేశారు.
గత 8 సంవత్సరాల కాలంలో హైదరాబాద్ విశ్వనగరంగా రూపాంతం చెందిందన్నారు. అత్యాధునిక వసతులతో రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడులను ఆకర్షిస్తోందన్నారు. ప్రపంచ దేశాల్లో అత్యంత యువశక్తి వున్న దేశం భారత్ అని, మన దేశంలో సగం జనాభా యువకులతోనే నిండి వుందన్నారు.







