జగిత్యాల జిల్లాలోని కొండగట్టు ఆంజనేయ స్వామిని ముఖ్యమంత్రి కేసీఆర్‌ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. హైదరాబాద్‌ నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌.. కొండగట్టు సమీపంలోని నాచుపల్లి జేఎన్టీయూకు చేరుకున్నారు. అక్కడ మంత్రులు ఇంద్రకరణ్‌ రెడ్డి, కొప్పుల ఈశ్వర్‌, గంగుల కమలాకర్‌ సీఎం కేసీఆర్‌కు ఘనంగా స్వాగతం పలికారు.తర్వాత రోడ్డుమార్గంలో ఆంజనేయ స్వామి క్షేత్రానికి చేరుకున్నారు. ఆలయం వద్ద సీఎం కేసీఆర్‌కు పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.

స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అర్చకులు ముఖ్యమంత్రికి వేదాశీర్వచనం అందించారు. అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. మంత్రులు, ప్రజాప్రతినిథులు, అధికారులతో కలిసి కొండగట్టుపై ఉన్న కోనేరు, కొత్త పుష్కరిణి, బేతాళస్వామి ఆలయం, సీతమ్మ కన్నీటిధార, కొండలరాయుడి గుట్ట తదితర స్థలాలను పరిశీలించారు. సీఎం కేసీఆర్ కొండగట్టు టూర్ సందర్భంగా పోలీసులు అక్కడ భారీ భద్రతను ఏర్పాటు చేశారు. సీఎం పర్యటన నేపథ్యంలో రాత్రి నుంచే భక్తులకు దర్శనాలను బంద్ చేశారు.