హిండెన్ బర్గ్ – అదానీ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ విషయంలో సుప్రీం కోర్టు పర్యవేక్షణలో కమిటీ వేసేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకారం తెలిపింది. అదానీ వివాదంపై దాఖలైన పిటిషన్ ను సుప్రీం కోర్టు సోమవారం విచారణకి స్వీకరించింది. కేంద్రం పక్షాన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తన వాదనలను వినిపించారు. ఇన్వెస్టర్ల భద్రత కోసం కమిటీ వేసేందుకు కేంద్రానికి లాంటి అభ్యంతరమూ లేదని స్పష్టం చేశారు. అయితే… ఈ వ్యవహారాన్ని సెబీ చూస్తోందన్నారు.
కేంద్రం వివరణపై స్పందించిన న్యాయమూర్తి బుధవారంలోగా కమిటీ సబ్యుల పేర్లను సుప్రీంకు సమర్పించాలని సొలిసిటర్ జనరల్ కు ఆదేశించింది. కేసు తదుపరి విచారణను ఫిబ్రవరి 17కు వాయిదా వేసింది. అదానీ గ్రూప్ స్టాక్ మానిప్యులేషన్, అకౌంటింగ్ ఫ్రాడ్ కు పాల్పడిందని హిండెన్ బర్గ్ ఆరోపించింది. ఈ క్రమంలో సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో కమిటీ వేసేలా కేంద్రాన్ని ఆదేశించాలంటూ సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్లు దాఖలయ్యాయి.
అదానీ రిపోర్టుపై కేంద్రం, ప్రధాని నరేంద్ర మోదీ స్పందించాల్సిందేనంటూ పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో ప్రతిపక్ష సభ్యులు రోజూ డిమాండ్ చేస్తూనే వున్నారు. వెల్ లోకి దూసుకెళ్లి, నినాదాలు చేస్తూండటంతో ఉభయ సభలు వాయిదాపడుతూ వస్తున్నాయి. ఏ విషయమైనా… తాము చర్చించేందుకు సిద్ధంగానే వున్నామని, ప్రతిపక్షాలు సంయమనంతో వుండాలని అధికార పార్టీ కోరుతోంది. మరోవైపు కమలంపై ఎంత బురదజల్లితే….. అంత వికసిస్తుందంటూ అదానీ రిపోర్టు విషయంలో ప్రధాని మోదీ ప్రతిపక్షాలకు కౌంటర్ ఇచ్చారు.












