తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ… హెచ్చరికలు జారీ చేశారు. గవర్నర్ శరీర రంగు గురించి కొందరు అదే పనిగా విమర్శలు చేస్తున్న నేపథ్యంలో చెన్నై వేదికగా తీవ్ర హెచ్చరికలు పంపారు. ‘నా శరీర రంగు గురించి కొందరు పదే పదే అదే పనిగా విమర్శలు చేస్తున్నారు. నేను నల్లగా వున్నానని అంటున్న ప్రత్యర్థులను అగ్గిలా మారి వణికిస్తా” అంటూ హెచ్చరికలు జారీ చేశారు. చెన్నై తండయార్‌పేటలోని బాలికల ప్రైవేటు పాఠశాలలో శనివారం జరిగిన వార్షికోత్సవంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. విద్యార్థినులకు బహుమతులు పంపిణీ చేసి మాట్లాడారు.
తన రంగు నలుపు అని, తన నుదురు బట్టతలలా ఉందని కొంతమంది హేళన చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను నలుపు అంటే అగ్గిలా మారుతానని, బట్టతల ఉన్న వ్యక్తి అంటూ విమర్శించేవారు సైతం ఓర్వలేనంతగా ఉన్నత స్థాయికి చేరతానని వ్యాఖ్యానించారు. మరోవైపు… విద్యార్థులందరూ బాగా కష్టపడి చదువుకోవాలని, ఇబ్బందులు వచ్చినా తట్టుకోవాలన్నారు. ఈ సందర్భంగా తన జీవితంలో జరిగిన కొన్ని ఘటనలను గవర్నర్ తమిళిసై విద్యార్థులతో పంచుకున్నారు.