నూతన సచివాలయం విషయంలో బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ అధికారంలోకి రాగానే కొత్త సచివాలయం డోమ్ ను కూల్చేస్తామని సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ అధకారంలోకి రాగానే… కొత్త సచివాలయంలో భారీగా మార్పులు తెస్తామని, తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా మారుస్తామని ప్రకటించారు. ప్రగతి భవన్ ను కూడా ప్రజా దర్బార్ గా మార్చేస్తామని హామీ ఇచ్చారు.
మరో వైపు రోడ్లకు అడ్డంగా వున్న గుళ్లు, మసీదులను కూల్చేస్తామని కేటీఆర్ కామెంట్స్ పై కూడా బండి సంజయ్ స్పందించారు. దమ్ముంటే పాతబస్తీ నుంచే ఇది మొదలు పెట్టాలని సవాల్ విసిరారు. కేసీఆర్ తెలంగాణను ఎంఐఎంకి కట్టబెట్టేయాలని చూస్తున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్, ఎంఐఎం రెండూ ఒక్కటేనని, ఆ రెండు పార్టీలూ కలిసి పోటీచేస్తే డిపాజిట్లు కూడా రావని ఎద్దేవా చేశారు. తెలంగాణలో నిజాం రాజ్యం పోయి, మన రాజ్యం రావాలని పిలుపునిచ్చారు.
రోడ్లపై అడ్డంగా ఉన్న గుళ్లు, మసీదులు, చర్చీలను కూల్చేస్తామని మంత్రి కేటీఆర్ అన్నారు. అసెంబ్లీలో మాట్లాడిన కేటీఆర్.. ఇందుకోసం ప్రత్యేకంగా ఓ చట్టం తెస్తామని చెప్పారు. రోడ్ల విస్తరణకు అడ్డుగా ఉండే మతపరమైన ఎలాంటి నిర్మాణాలనైనా తొలగిస్తామన్నారు. ట్రాఫిక్ ఇబ్బంది ఉంటే కూల్చక తప్పదని చెప్పారు. గుజరాత్ లో అమలు చేస్తున్న చట్టాన్ని స్టడీ చేస్తున్నామని అన్నారు. దుమ్ము,ధూళిలో ఉండాలని ఏ దేవుడు కోరుకోడని కేటీఆర్ చెప్పారు.