పోడు భూములకు సంబంధించి సీఎం కేసీఆర్ అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు. ఈ నెలాఖరులోగా పోడు భూములకు పట్టాలు పంపిణీ చేస్తామని ప్రకటించారు. పంపిణీ చేశాక రైతుబంధు, విద్యుత్, సాగునీటి సౌకర్యం కల్పిస్తామని చెప్పారు. అయితే భూములు తీసుకున్న గిరిజనులు ఇకనుంచి పోడు భూములను రక్షిస్తామని హామీ ఇవ్వాలన్నారు. పోడు భూముల పంపిణీ పూర్తయ్యాక అటవీ ప్రాంతాలను ఆక్రమిస్తే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. భూమిలేని గిరిజన బిడ్డలకు దళితబంధు తరహాలోనే గిరిజన బంధు ఇచ్చి సాయం చేస్తామన్నారు. క్షేత్ర స్థాయిలో లెక్కలు తీశామని రాష్ట్రంలో 11.50 లక్షల ఎకరాల పోడు భూములున్నట్టు గుర్తించామని ఆయన అసెంబ్లీ వేదికగా వెల్లడించారు. ఈ లెక్క ఇంతకే పరిమితం కావాలని, మళ్లీ అడవులను నరుకుతామంటే ఊరుకోబోమని హెచ్చరించారు. అడవి బిడ్డలయితే… అడవి అంతా కొట్టేస్తారా? అంటూ సూటిగా ప్రశ్నించారు.
ఈ నెలాఖరులో పోడు భూముల పంపిణీ ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. పంపిణీ చేశాక రైతుబంధు, విద్యుత్, సాగునీటి సౌకర్యం కల్పిస్తామని చెప్పారు. జెండాలు పట్టుకొని ధర్నాలు చేయడం కొన్ని పార్టీలకు అలవాటుగా మారిపోయిందని తీవ్రంగా మండిపడ్డారు. గిరిజనుల హక్కులు కాపాడాల్సిందే కానీ… రాష్ట్రంలో అటవీ సంపద వుండాలా? కనుమరుగై పోవాలా? అంటూ నిలదీశారు. రాష్ట్రంలో ఉన్న 66 లక్షల ఎకరాల అటవీప్రాంత రక్షణ కోసం సాయుధ బలగాలను నియమిస్తామని చెప్పారు. పట్టాలుపొందాలంటే గ్రామాల వారీగా తీర్మానాలు చేయాలన్నారు. ఈ తీర్మానంలో అఖిలపక్ష నాయకులు, గిరిజన పెద్దలు, సర్పంచ్, ఎంపీటీసీ సంతకాలు చేయాల్సి ఉంటుందన్నారు. అలా తీర్మానం చేయని గ్రామాల్లో పట్టాల పంపిణీ ఉండబోదని స్పష్టం చేశారు.
పోడుభూములపై ప్రతిసారి రాజకీయ చేయడం సరికాదని సూచించారు. పోడు భూములు అనేవి హక్కు కాదు… దురాక్రమణ అని స్పష్టం చేశారు. విచక్షణారహితంగా అడవులు నరికేయడం సరికాదన్నారు. పర్యావరణ పరిరక్షణపై ప్రపంచవ్యాప్తంగా చర్చలు జరుగుతున్నాయని చెప్పారు. పోడు, అటవీ భూములు పలువురికి ఆటవస్తువులా తయారయ్యాయని ఆగ్రహం వ్యక్తంచేశారు. గిరిజనులపై దౌర్జన్యం జరుగకుండా చూడాలని సూచించారు. పోడు భూములపై తమ సర్కార్ కి స్పష్టమైన అవగాహన వుందన్నారు. స్పష్టత వుందన్నారు. గిరిజనులు ఏ ప్రాంతాన్ని అయితే సాగు చేసుకుంటున్నారో.. అది ఇవ్వడానికి తమకు అభ్యంతరం లేదని స్పష్టం చేశారు. పోడు భూముల వ్యవహారం ఇలాగే కొనసాగాలా? లేదా ముగింపు వుండాలా? అని ప్రశ్నించారు. అడవులు ఎవరి పుణ్యంతో నాశనం అవుతున్నాయో చూశామని అన్నారు.