బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో బహిరంగ సభ జరగడం ఇది మూడోది. పరేడ్ గ్రౌండ్ లో జరిగే బహిరంగ సభకు చేయాల్సిన జన సమీకరణపై మంత్రి కేటీఆర్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో అసెంబ్లీ హాల్‌లో గురువారం మ‌ధ్యాహ్నం స‌మావేశ‌మ‌య్యారు. ఈ నెల 17న జ‌రిగే ప‌రేడ్ గ్రౌండ్స్ స‌భ‌పై మంత్రులు, ఎమ్మెల్యేల‌తో కేటీఆర్ చ‌ర్చించారు. ఈ స‌భ‌ను విజ‌య‌వంతం చేయాల‌ని కేటీఆర్ ఆదేశించారు. భారీ జ‌న స‌మీక‌ర‌ణ‌పై మంత్రుల‌కు, ఎమ్మెల్యేల‌కు కేటీఆర్ ప‌లు స‌ల‌హాలు, సూచ‌న‌లు చేశారు.

 

ప్రతి నియోజకవర్గం నుంచి కనీసం 10 వేల మంది హాజరయ్యేలా చూడాలని టార్గెట్ విధించారు. ఈ నెల 13 న గ్రేటర్ పరిధిలోని నియోజవకర్గ కార్యకర్తల సమావేశం నిర్వహించాలని సూచించారు. ఒక్కో నియోజకవర్గానికి ఇతర జిల్లాలకు చెందిన సీనియర్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను ఇంచార్జీలుగా నియమిస్తున్నారు. ఈ నెల 13 నుంచి 17 వరకూ ఇంచార్జీలు వారికి కేటాయించిన నియోజకవర్గంలోనే వుండనున్నారు. ఈ సభను విజయవంతం చేయాలని సూచించారు.

 

రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్‌లో నూతనంగా నిర్మించిన డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ తెలంగాణ సచివాలయ భవనాన్ని ఈ నెల 17వ తేదీన ఉదయం 11.30 గంటల నుంచి 12.30 గంటల మధ్య ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించ‌నున్నారు. ఈ కార్యక్రమంలో తమిళనాడు, జార్ఖండ్‌ ముఖ్యమంత్రులు స్టాలిన్‌, హేమంత్‌సోరెన్‌, బీహార్‌ ఉప ముఖ్యమంత్రి తేజస్వీయాదవ్‌, బీహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్‌ తరఫున ఆయన ప్రతినిధిగా జేడీయూ జాతీయ అధ్యక్షుడు లలన్‌సింగ్‌ హాజరుకానున్నారు.

 

భవన ప్రారంభోత్సవానికి ముందు ఉదయం వేద పండితుల ఆధ్వర్యంలో వాస్తుపూజ, చండీయాగం, సుదర్శనయాగం తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించ‌నున్నారు. సచివాలయ ప్రారంభం తరువాత మధ్యాహ్నం సికింద్రాబాద్‌లోని పరేడ్‌గ్రౌండ్స్‌లో భారీ బహిరంగసభ నిర్వహించనున్నారు. ఈ సభలో సచివాలయ ప్రారంభోత్సవానికి హాజరయ్యే ముఖ్య అతిథులంతా పాల్గొన‌నున్నారు.