తెలంగాణ రాష్ట్రం ఎలక్ట్రిక్ వాహనాల తయారీ కేంద్రంగా మారబోతోందని ఐటీ మంత్రి కె. తారక రామారావు అన్నారు. దేశీయ, ప్రపంచ కంపెనీలు ఈవీ రంగంలో భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నట్టు తెలిపారు. మహీంద్రా, ఒలెక్ట్రా, జెడ్‌ఎఫ్, మైస్ట్రాహ్, గ్రావ్టన్, హ్యుందయ్ మొబిస్, వన్ మోటో, ప్యూర్ ఈవీ వంటి కంపెనీలకు తెలంగాణ ఇప్పటికే నిలయంగా మారిందని వివరించారు. మాదాపూర్‌లోని హైటెక్స్‌లో బుధవారం ‘హైదరాబాద్ ఈ-మొబిలిటీ వీక్’లో భాగంగా మొదటి ఎడిషన్ ‘ఈవీ మోటర్’ షోను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…. ఈవీల ప్రోత్సాహానికితెలంగాణ కట్టుబడి ఉందని, అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తామన్నారు.

కొత్తగా వస్తున్న టెక్నాలజీలు, ఎమర్జింగ్ టెక్నాలజీల్లో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు తెలంగాణ గమ్యస్థానంగా ఉందని తెలిపారు. తెలంగాణ మొబిలిటీ వ్యాలీ ఏర్పాటుతో ఎలక్ట్రిక్ వెహికిల్స్ రంగానికి చెందిన ఉత్పత్తుల తయారీ, పరిశోధనా, అభివృద్ధికి అవకాశం ఏర్పడిందన్నారు. సెల్ మ్యాన్‌ఫ్యాక్చరింగ్ , సెల్ కాంపోనెంట్ తయారీ, బ్యాటరీ మార్పిడి స్టేషన్లు, టూవీలర్, 3 వీలర్లతోపాటు ఈవీ బస్సుల తయారీ, లిథియం శుద్ధి దిశగా అడుగులు వేస్తూ తెలంగాణ సమగ్ర వ్యూహాన్ని అనుసరిస్తోందని పేర్కొన్నారు.

భారతదేశ ఎలక్ట్రిక్ మొబిలిటీ రంగంలో కీలక పాత్ర పోషించాలని తెలంగాణ లక్ష్యంగా పెట్టుకొన్నట్టు చెప్పారు. పుష్కలంగా నీళ్లు, నాణ్యమైన విద్యుత్తు, సామాజిక మౌలిక వసతులు, అంకితభావం కలిగిన ఉద్యోగులు రాష్ట్రంలో అందుబాటులో ఉన్నారని పేర్కొన్నారు. కంపెనీలకు అవసరమయ్యే అత్యవసర సదుపాయాలను అభివృద్ధి చేయడానికి కృషి చేస్తున్నామని వివరించారు. తెలంగాణ మొబిలిటీ వ్యాలీ ఏర్పాటుతో ఈవీల తయారీ, రిసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్‌కు అవకాశం ఏర్పడిందని చెప్పారు. అడాస్, డిజిటల్ కాక్‌పిట్ సొల్యూషన్స్, వీ2ఎక్స్ కనెక్టివిటీ, ఆటోమోటివ్ సైబర్ సెక్యూరిటీతో సహా దేశంలో అధునాతన ఆటోమోటివ్ టెక్నాలజీల అభివృద్ధిలో హైదరాబాద్ దూసుకుపోతున్నదని వివరించారు. రాబోయే రోజుల్లో ఆటోమొబైల్ కంపెనీలు సరికొత్త ఈవీ మోడళ్లను ఆవిష్కరించడానికి హైదరాబాద్ ఈ-మోటార్ షో మార్గదర్శిగా నిలుస్తుందని పేర్కొన్నారు.