బీజేపీ ప్ర‌భుత్వం అంత్యోద‌య సిద్ధాంతాన్ని వ‌దిలేసి.. అదానీ సిద్ధాంతాన్ని అమ‌లు చేస్తుంద‌ని రాష్ట్ర ఆర్థిక మంత్రి హ‌రీశ్‌రావు ఎద్దేవా చేశారు. చిట్ట చివరి వ్యక్తి వరకు సంక్షేమ ఫలాలు అందించాలన్నదే అంత్యోదయ సిద్దాంతమని, కానీ బీజేపీ వాళ్లకు పేద ప్రజల సంక్షేమం వద్దు, కార్పొరేట్లకు దోచిపెట్టుడే ముద్దు అన్నచందంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని మండిప‌డ్డారు. శాస‌నస‌భ‌లో బ‌డ్జెట్‌పై చ‌ర్చ జ‌రిగిన సంద‌ర్భంగా మంత్రి హ‌రీశ్‌రావు ప్రసంగిస్తూ బీజేపీపై విమర్శలు చేశారు. చివ‌ర‌కు పారాసిటామ‌ల్ మెడిసిన్ ధ‌ర‌ను కూడా మోదీ ప్ర‌భుత్వం పది శాతం పెంచింద‌ని హ‌రీశ్‌రావు గుర్తు చేశారు. క‌రోనా త‌ర్వాత పారాసిటామ‌ల్ వాడకం ఎక్కువైంద‌న్నారు. ఇదే అదునుగా భావించిన కేంద్రం.. ఆ మెడిసిన్స్ ధ‌ర‌లు పెంచ‌డం స‌రికాద‌న్నారు. ఒక్క పారాసిటామ‌ల్ మెడిసిన్ ధ‌ర‌లే కాదు.. 898 మెడిసిన్‌ల రేట్లు 10.7 శాతం పెరిగాయ‌న్నారు. దేశ పాలకుల ఇది అమృత్‌ కాలమైతే.. దేశ ప్రజలకు మాత్రం కనీసం తాగునీరు దొరకని ఆపద కాలమని ఎద్దేవా చేశారు.

 

దేశంలోని కొన్ని రాజకీయ పార్టీలకు రాజకీయాలంటే ఒక గేమ్‌. కానీ, సీఎం కేసీఆర్‌కు, బీఆర్‌ఎస్‌ పార్టీకి పాలిటిక్స్‌ ఒక టాస్క్‌ అని మంత్రి హరీశ్ రావు వివరించారు. ఏ లక్ష్యాన్ని అయినా పట్టుదలతో దాన్ని పూర్తి చేసేలా ప్రజల కోణంలో, మానవీయ కోణంలో పని చేసే ప్రభుత్వం బీఆర్‌ఎస్‌ ప్రభుత్వమని తెలిపారు. మిషన్ భగీరథతో సహా… అన్ని పథకాలను సీఎం కేసీఆర్ ఓ టాస్క్ గా భావించడం వల్లే అవి పూర్తయ్యాయని తెలిపారు.

 

రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ పరిపాలన, దేశంలో మోదీ నాయకత్వంలో బీజేపీ పరిపాలన ఒకేసారి ప్రారంభమయ్యాయని హరీశ్ పేర్కొన్నారు. అధికారంలోకి ఆరేడేళ్లలోనే 2020 నాటికి మిషన్‌ భగీరథను పూర్తి చేశామని, కేంద్ర జల్‌జీవన్‌ మిషన్‌ 2022లో మిషన్‌ భగీరథలో ఇంటింటికి మంచినీరు ఇచ్చినందుకు రాష్ట్రానికి అవార్డు ఇచ్చిందన్నారు. మన పథకాన్ని ‘హర్‌ఘర్‌కో జల్‌’ పేరుతో కాపీ కొట్టారు కానీ.. స్పీడ్‌గా పనులు చేయడం లేదని విమర్శించారు.